రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ సెల్ఫీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమ ప్రభుత్వం మెట్రో మార్గం, ఫార్మాసిటీ సహా దేనినీ రద్దు చేయడం లేదని.. ప్రజోపయోగకరంగా మార్పులు మాత్రమే చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తుందే తప్ప.. రాష్ట్రానికి భారమయ్యే ఏ పనీ చేయబోదని వివరించారు. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజీలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, తక్కువ ఖర్చుతోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ను అనుసంధానిస్తామని తెలిపారు.
చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలు శాచురేషన్‌కు వచ్చాయని.. రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా, ఎయిర్‌పోర్టుకు అవతలివైపు కోటిన్నర ప్రజలతో కొత్త సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే మెట్రో విస్తరణ చేపడతాం. మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు విస్తరిస్తాం. అవసరమైతే రామచంద్రాపురం వరకు పొడిగిస్తాం. నాగోల్–ఎల్‌బీనగర్–ఒవైసీ ఆస్పత్రి మీదుగా ఫలక్‌నుమా–శంషాబాద్ వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైల్ విస్తరిస్తాం. అలాగే మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించి పూర్తిస్థాయిలో వినియోగిస్తాం. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరణ కోసం రూ.9వేల కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమైంది.
అలాగే బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మరోలైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు విస్తరించకుండా కొత్తగా చేపట్టడం అనవసర వ్యయమే. అక్కడి నుంచి మెట్రో ఎక్కేవారు ఎవరూ ఉండరు. అది నిర్మించి ఉంటే.. కాళేశ్వరం తరహాలో రాష్ట్రానికి భారంగా మారేది. మేం చేసిన మార్పులతో నగరంపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుత మెట్రోకు అనుసంధానం చేయడం వల్ల వ్యయం కూడా తగ్గుతుంది.
ఫార్మాసిటీకి బదులు ఫార్మా విలేజ్‌లు
25వేల ఎకరాల్లో ఒకే చోట ఫార్మాసిటీ నిర్మిస్తే.. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పనికిరాకుండా పోతుంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు మాదిరిగా అవుతుంది. అందుకే ఔటర్ రింగ్‌రోడ్డు– రీజనల్ రింగ్‌రోడ్డు మధ్య పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. నిరుపయోగంగా భూములు తీసుకుని ఒక్కో క్లస్టర్‌లో వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల్లో జీరో పొలుష్యన్ ఉండేలా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒక్కోదానిలో పది పరిశ్రమలు ఉండేలా చూస్తాం.
అక్కడ పనిచేసే వారికి అదే క్లస్టర్‌లో గృహాలతోపాటు అన్ని సౌకర్యాలతో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, టౌన్íÙప్‌లు, విద్యాలయాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవన సముదాయాలు, వినోద సంబంధిత మల్టీప్లెక్స్‌లు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. బీవైడీ వంటి ఎల్రక్టానిక్ కార్ల కంపెనీలు సహా రాష్ట్రానికి వచ్చే ఎలాంటి పరిశ్రమలనూ వదులుకోబోం. వారికి అవసరమైన రాయితీలు కల్పిస్తాం.
ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో వర్సిటీలు..
రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం అగ్రశ్రేణి కంపెనీలను ఆహా్వనించాం. టాటా, మహీంద్రా, సెంచురీ సంస్థల ఆధ్వర్యంలో అవి ఏర్పాటవుతాయి. ఒక్కో పరిశ్రమ ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇంటర్ పూర్తిచేసిన వారికి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. విద్యాశాఖ పర్యవేక్షణలోనే ఈ వర్సిటీలు ఉంటాయి.
వీటిలో అభ్యసించే వారికి ఆ సంస్థలే ఉపాధి కల్పించడం, క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు వంటి చర్యలు చేపడతాయి. నైపుణ్యంతో కూడిన డిగ్రీ ఉంటే వారికి ఉపాధి గ్యారంటీ అవుతుంది. ఒక్కో యూనివర్సిటీకి ప్రభుత్వం రెండు వందల ఎకరాల వరకు భూమి ఇస్తుంది. ప్రస్తుతం టాటా సంస్థ రూ.1,400 కోట్లు ఐటీఐలపై వెచ్చిస్తే.. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు వెచ్చిస్తుంది.
రాష్ట్ర అతిథి గృహంగా.. వైఎస్సార్ క్యాంప్ ఆఫీసు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని రాష్ట్ర అతిథిగా గృహంగా మారుస్తున్నాం. నివాస భవనాన్ని మంత్రి నివాసంగా కేటాయించాం. కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని కొత్తగా ప్రారంభించనున్న ‘మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్’ కోసం వినియోగిస్తాం.
వంద పడకల ప్రతి ఆస్పత్రికి నర్సింగ్ కళాశాల
రాష్ట్రంలో వంద పడకలున్న ప్రతీ ఆస్పత్రికి అనుబంధంగా ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. నర్సులకు విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. మధ్య తరగతిలో వృద్ధులను చూసుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. వారికి చేదోడువాదోడుగా ఉండే నర్సులకు స్థానికంగానూ ఉపాధి లభిస్తుంది. విదేశాల్లో పనిచేసే నైపుణ్యం ఉన్న, లేనివారికి కూడా ఓరియంటేషన్ ఇప్పిస్తాం. విదేశాల్లోని పరిశ్రమలతో ప్రభుత్వమే సంప్రదింపులు జరిపి ఉద్యోగాలు కల్పిస్తాం. వేతనాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వారికి ఏ ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది..’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ప్రజల ప్రభుత్వం మాది
మాది ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం. ప్రజావాణి కోసం ప్రజలంతా రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోంది. మంత్రులందరినీ కూడా ప్రజల దగ్గరకే వెళ్లాలని కోరాను. 80శాతం సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతాయి. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వం. మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. గతంలో ఒక్కరే పనిచేసేవారు. ఆయనే ఫోటోలో, ప్రచారంలో ఉండేవారు. ఇప్పుడు మంత్రులంతా ప్రజల్లోనే ఉంటున్నారు. మా పాలనలో పరిపాలన వికేంద్రీకరణ చేశాం. వందరోజులు టార్గెట్‌గా పనిచేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment