ఆ... ఒక్కటీ అడక్కు
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నా... పెద్ద పోస్టు దక్కించుకోలేకపోతున్నారు. టీటీడీపీ శాసనసభ పక్షం నేత పదవి చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రేవంత్‌ను కాదని ఆ పదవిని అధినేత చంద్రబాబు మరో సీనియర్ నేత ఎర్రబెల్లికి కట్టబెట్టడంతో జిల్లాకు చెందిన టీడీపీ కేడర్‌లో నిరాశ అలుముకుంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మరోసారి భంగపాటు తప్పలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీలో ఆయనకు కీలక పదవి దక్కడం లేదు. 2014 సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు రేవంత్ సిద్ధమైన చంద్రబాబు నాయుడు ససేమిరా అనడంతో తిరిగి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
2009 ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు సాధించిన టీడీపీ 2014 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా ఫలితం సాధించింది. కీలక నేతలందరూ పరాజయం పాలైనా రేవంత్‌రెడ్డి రెండో పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే టీడీపీలోని ఓ బలమైన సామాజిక వర్గం రేవంత్‌రెడ్డికి పదవి దక్కకుండా ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. ఆయనకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీమాంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్న ఈ సామాజిక వర్గం చంద్రబాబుపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాకు చెందిన నాగం జనార్దన్‌రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం ఫోరం అధ్యక్షుడిగా నియమించిన సందర్భంలో ఎదురైన సమస్యలను రేవంత్ వ్యతిరేక వర్గం గుర్తు చేసినట్లు సమాచారం.
బాబు తీరుపై తమ్ముళ్ల గుర్రు
తెలంగాణ ఏర్పాటు సందర్భంగా చంద్రబాబు అనుసరించిన వైఖరితో ఇప్పటికే పార్టీ పరిస్థితి జిల్లాలో నామమాత్రంగా తయారైందని పార్టీ కేడర్ గుర్రుగా ఉంది. సీమాంధ్రలో తాను అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారనే ఆగ్రహం పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది. జిల్లా నుంచి గెలిచిన ఒకరిద్దరు నేతలను కూడా చంద్రబాబు విశ్వాసంలోకి తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా టీడీపీ ఫలితం సాధించింది.
పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పక్షాన గెలుపొందిన మెజారిటీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక చైర్మన్ల ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కండువాలు మార్చుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. సంఖ్యాబలం అవసరమైన చోట ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండటంతో రాబోయే రోజుల్లో తెలుగు తమ్ముళ్లు పార్టీలో కొనసాగడం అనుమానమేనని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.