రేవంత్ బెయిల్ షరతుల సడలింపు
బెయిల్ రద్దు చేయాలన్న ఏసీబీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ షరతులను హైకోర్టు సడలించింది. ప్రతి రోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలన్న షరతును తొలగించింది. ఇదే సమయంలో రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయగా.. కొద్దిరోజులపాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అనంతరం ఈ కేసులో హైకోర్టు రేవంత్‌రెడ్డికి పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరై సంతకం చేయాలని, కేసు అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దంటూ పలు షరతులు విధించింది.
అయితే బెయిల్‌పై విడుదలైన సందర్భంగా రేవంత్‌రెడ్డి షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారని, అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు రోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలన్న షరతును సడలించాలంటూ రేవంత్ కూడా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ సురేశ్ కెయిత్ విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిందని, నిందితులు ప్రతీ విచారణకు ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ రద్దు చేయాలనడం సరికాదంటూ ఏసీబీ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక రోజూ దర్యాప్తు అధికారి ఎదు ట హాజరుకావాలన్న షరతును న్యాయమూర్తి సడలించారు. అయితే దర్యా ప్తు అధికారి కోరినప్పుడల్లా హాజరుకావాలని రేవంత్‌రెడ్డికి స్పష్టం చేశారు.