దావత్‌లతో కాలం గడపకుండా హైకోర్టు సమస్యను పరిష్కరించండి
- గవర్నర్‌పై రేవంత్‌రెడ్డి విసుర్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో ముచ్చట్లు, దావత్‌లతో కాలం గడపకుండా హైకోర్టు వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చొరవ చూపాలని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆందోళనలతో రాష్ట్రం రగిలిపోతుంటే గవర్నర్ మౌన ప్రేక్షకుడి పాత్రను పోషించడం తగదన్నారు. బుధవారం ఆయన పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పునర్విభజన చట్టంలో విస్తృత అధికారాలు ఉన్న ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ వాటిని విస్మరించడం వల్లనే పరిస్థితులు విషమిస్తున్నాయన్నారు.
వారానికి రెండుసార్లు కేసీఆర్, కేటీఆర్‌లతో సమావేశమయ్యే గవర్నర్ రాష్ట్రంలోని ప్రధానమైన సమస్య గురించి వారితో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రానికి అవసరమైన నివేదికలు పంపి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. హైకోర్టు విభజనపట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ సమస్యను ఏపీ సీఎం చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. హైకోర్టు విభజనపై బాబు కేంద్రానికి 2014లోనే లేఖలు రాసినట్లు చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 30కి సవరణలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కనుసన్నల్లోనే విభజన చట్టం తయారైన విషయాన్ని మరిచారా అని ఆయన ప్రశ్నించారు.