వేటు.. వివాదం | Revolts in congress party due to suspend of arunatara | Sakshi
Sakshi News home page

వేటు.. వివాదం

Published Fri, Apr 18 2014 2:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Revolts in congress party due to suspend of arunatara

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:  కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ‘బహిష్కరణ’ వివాదం చెలరేగింది. జుక్కల్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన మాజీ ఎమ్మె ల్యే, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతారను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతి సారీ జిల్లాలో కాంగ్రెస్‌కు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పడం లేదు. టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్థాయి నాయకులు పార్టీలు మారగా, జుక్కల్ నుంచి రెబల్ గా ఉన్న అరుణతారను సస్పెండ్ చేయడం వివాదాస్పదమవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులకు సారథ్యం వహిస్తున్న నేతలు ఒక్కొక్కరు, ఒక్కొక్కరిని
 వెనకేసుకు రావడం వలననే తరచూ రెబల్స్ బెడద ఎదురవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 జుక్కల్ నుంచి 1999లో రెబల్‌గా పోటీ చేసి ఒకసారి, 2009 ఎన్నికల తర్వాత పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెండోసారి బహిష్కరణకు గురైన సౌదాగర్ గంగారాంకు ఈసారి టికెట్ రావడం, పార్టీలో మహిళ విభాగానికి జిల్లా అధ్యక్షురాలుగా ఉంటూ టికెట్ ఆశించి భంగపడిన అరుణతారపై వేటు పడటం చర్చనీయాంశాలుగా మారాయి.

 గ్రూపుల పోరే కారణం
 కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద.. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల మధ్యన నెలకొన్న గ్రూపు తగాదాలే కారణమన్న మాట వినిపిస్తోంది. పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రులు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీల మధ్యన సాగుతున్న వర్గ పోరు ఇందుకు ఆజ్యం పోస్తోందన్న చర్చ కూడ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాజాగా టికెట్ల గొడ వ మొదలైంది. సీట్ల కేటాయింపులలో నాయకులు పకడ్బందీగా వ్యూహం రూపొందించారన్న ప్రచారం ఉంది.

పార్టీలో పనిచేసిన నేతలను పూర్తిగా విస్మరించి, ఎవరికి సంబంధించిన అనుచరులకు వారు టికెట్ ఇప్పించుకోవడంలో కృతకృత్యులు కావడం పార్టీలో అసంతృప్తికి కారణమైందని అంటు న్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ కనుసన్నలలోనే బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు జరిగిందన్న చర్చ ఉంది. దీంతో ఇద్దరు నేతలపై అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్మే జనార్దన్ గౌడ్, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులులు ఇటీవలే టీఆర్‌ఎస్, బీజేపీలలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థులే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

 కేడర్‌లో చర్చ
 జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం వివాదం కాంగ్రెస్‌లో తాజా చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌కు 1999లో పార్టీ టికెట్ దక్కగా, సౌదాగర్ గంగారాం రెబల్‌గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ గంగారాంను ఆరేళ్లపాటు కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. తదనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ టికెట్ పైనే 2004లో పోటీ చేసిన గంగారాం టీడీపీ అభ్యర్థి హన్మంత్ సిం ధేపై గెలుపొందారు. 2009లో ఆయన భార్యను బరిలో దించగా ఓటమిపాలు కావడ ంతో డి.శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై గంగారాం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు.

 అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా ఉన్న గంగారాం ‘సార్వత్రిక’ నోటిఫికేషన్‌తో తెరపైకి రావడమే కాకుండా, టికెట్ కూడా తెచ్చుకున్నారు. దీంతో అరుణతార, రాజేశ్వర్‌కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో కొందరు సీనియర్లకు వ్యతిరేకంగా మాజీ మంత్రి షబ్బీర్, ఎంపీ అభ్యర్థి షెట్కార్ పావులు కదిపారన్న నిరసన కూడా వ్యక్తమైంది. అధిష్టానంతో బుజ్జగింపులతో రాజేశ్వర్ పోటీ యోచనను విరమించుకోగా, అరుణతార మాత్రంలో రెబల్‌గా బరిలో ఉం డాలనే నిశ్చయించుకున్నారు.ఈ క్రమంలో జిల్లాలో రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితులో ఎలా ఉంటాయో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement