
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
హుజూరాబాద్‌టౌన్/కమలాపూర్ : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ భోజన పథకం, చెల్పూర్‌లో ఆహార భద్రత పథకం, హుజూరాబాద్‌లోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో, కమలాపూర్‌లోని గురుకుల, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం పథకాలను ఆయన లాంఛనంగా ప్రాంభించారు.
స్వయంగా బియ్యం తూకం వేసి రేషన్ లబ్దిదారులకు అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అన్నం వడ్డించారు. కమలాపూర్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. స్రంక్షేమ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టడమే కాదు.. వారిని జైలుకు పంపేదాక వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
తాము గతం కన్నా ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అర్హులైందరికీ పింఛన్ మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఇస్తామన్నారు. భర్తలు వదిలేసిన వారు, జోగినిలకు కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో జిల్లాలో 3.90 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 4 లక్షలు దాటాయన్నారు.
ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రూ.1.50 లక్షల ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 9.71 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులుండగా, ప్రస్తుతం మరో 50 వేలకు పైగా ఆహారభదత్ర కార్డులు పెరిగాయన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఒక పూట సంపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో రూ.220 కోట్లతో 17 అంగన్‌వాడీ సెంటర్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. నాణ్యమైన సరుకులు వస్తున్నాయా, లేదా అని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇస్తున్న 16 గుడ్లకు బదులు ఇక నుంచి 30 గుడ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏడు నెలల పిల్లలకు నెలకు 16 గుడ్లు, ఆరేళ్ల లోపు పిల్లలకు నెలకు 30 గుడ్లు అందిస్తున్నామన్నారు. గుడ్లపై ఉత్పత్తి తేదీ, ఎక్స్‌పైరీ తేదీ ముద్రించి 45 గ్రాముల నుంచి 53 గ్రాముల బరువుండే గుడ్లు సరఫరా చేస్తామన్నారు.
పిల్లలు, పేద విద్యార్థులంతా తెలంగాణ రాష్ట్ర ఆస్తులని, వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలని, ముక్కిన బియ్యం, దొడ్డు బియ్యం స్థానంలో సూపర్‌ఫైన్ బీపీటీ రకం సన్నబియ్యం సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్నభోజన పథకానికి సరఫరా చేస్తున్నామన్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు రెట్టింపు చేశామని, ఆడపిల్లలకు రూ.125కు పెంచామన్నారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పెద్దపాపయ్యపల్లిలో చిన్నారుల ఆటపాటలను మంత్రి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌డీవో చం ద్రశేఖర్, ఆర్‌జేడీ శైలజ, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, ఏపీడీ మోహన్‌రెడ్డి, డీఎస్‌వో చంద్రప్రకాశ్, గురుకు ల పాఠశాలల కార్యదర్శి మల్లయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.