సాక్షి, వరంగల్: ఖాకీ అంటే వారిలో కరకుదనం ఉంటుందనుకుంటాం. కానీ మాకూ హృదయముంది.. మేమూ చేతనైన సేవ చేస్తాం అని చాటిచెప్పారు రైల్వే పోలీసులు. అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి సత్వరం వైద్య చికిత్సలందించేందుకు రైల్వే స్టేషన్ మేనేజర్‌తో కలిసి సాయపడి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్‌నగర్ జిల్లా కట్టసార్ గ్రామానికి చెందిన శంకర్‌రామ్(19) కేరళలోని ఓ టైర్లు తయారీ కంపెనీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి వెళ్లేందుకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఖమ్మం దాటగానే అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో సీటులోనే కూలబడి అల్లాడిపోతుండగా తోటి ప్రయాణికులు రైల్వే టీటీఈకు చెప్పారు. ఆయన వరంగల్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. స్టేషన్ మేనేజర్ వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు స్టేషన్‌కు చేరారు. ప్లాట్‌ఫామ్-2లో రైలు ఆగగానే అక్కడ వేచి ఉన్న స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, ఆర్‌పీఎఫ్ హెచ్‌సీ రాజిరెడ్డి, పీసీలు సదానందం, రియాజ్, సంజీవరావు, హోంగార్డు చిమ్నా నాయక్‌లు శంకర్‌రామ్‌ను చేతులమీద మోసుకుని ప్లాట్‌ఫాం-1పై ఉన్న108 వాహనం వద్దకు చేర్చారు. 108 సిబ్బంది తగిన చికిత్స అందిస్తూ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంపట్ల ప్రయాణికులు వారిని అభినందించారు. శంకర్‌రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment