నెత్తురోడిన రహదారి | road Accident | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారి

Published Fri, Jun 6 2014 2:19 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నెత్తురోడిన రహదారి - Sakshi

నెత్తురోడిన రహదారి

 ఉట్నూర్ రూరల్/ఆదిలాబాద్/ఇంద్రవెల్లి/తాండూర్, న్యూస్‌లైన్ : రహదారి నెత్తురోడింది. మృత్యువు కాపుకాసి నలుగురిని బలితీసుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారు క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. గమ్యస్థానానికి చేరుకునేలోపే కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇరుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉండటం విషాదకరం.
 
 అతివేగం ప్రాణం తీసింది..
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండుగూడకు చెందిన పవన్ జైస్వాల్ కుటుంబ సభ్యులు వారి బంధువులు కలిపి దాదాపు 20 మంది ఆటో ట్రాలీలో గురువారం ఉదయం ఉట్నూర్‌లోని శివరామ గురుదత్త సాయి కృష్ణ మందిరంలో జరిగిన ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. మధ్యాహ్యం 2.30 గంటలకు తిరిగి ఇం ద్రవెల్లికి బయలు దేరారు. ఈ క్రమంలో ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్దకు ఆటోట్రాలీ రా గానే ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఇండికా కారు వేగంగా ఢీకొట్టింది.
 
కారులో ప్ర యాణిస్తున్న చాపిడి శంకర్, భాస్కర్‌గౌడ్, రాజ్‌కుమార్‌తోపాటు మరొకరికి, ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో కొందరికి ఉట్నూర్ ఆస్పత్రికి, మరికొందరికి రిమ్స్‌కు తరలించారు. ఉట్నూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చాపిడి శంకర్(25) మృతి చెందారు. రిమ్స్‌తో చికిత్స పొందుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండుగూడకు చెందిన పవన్ తల్లి నిర్మల జైస్వాల్(45), వరుసకు అత్త అయిన కాంతాబాయి(54), తన బాబాయి దిలీప్ జైస్వాల్ కుమారుడు సాయి(15) మృతిచెందారు.
 
మిగతా క్షతగాత్రులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రక్తంతో రహదారి తడిసింది. విషయం తెలియడంతో స్థానికులు గుమిగూడారు. స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రహదారి దద్దరిల్లింది.
 
 ఉపాధి కోసం వెళ్లి..
 తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన చాపిడి పీరయ్య(రాజయ్య), శోభ దంపతులకు ఆరుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారు లు, నలుగురు కుమార్తెలు. కుమార్తెలు విజయ, రీన, మీనలకు వివాహాలు కాగా కుమారుడు హ రిదాస్, చిన్న కుమార్తె సోనీలు తల్లిదండ్రులతో నే ఉంటున్నారు. రెండో సంతానమైన శంకర్ నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం రేచిని నుంచి వెళ్లిపోయి మంచిర్యాలలో ఉంటున్నాడు.
 
 గురువారం స్నేహితులతో కలిసి కార్‌లో ఆదిలాబాద్ కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా శ్యాంపూర్ వద్ద జ రిగిన ఘటనలో శంకర్ మృతి చెందాడు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే పీరయ్య కుటుం బం ఇంటికి పెద్ద కొడుకును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. శంకర్ మృతితో రేచినిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న శంకర్ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఉట్నూర్‌కు వెళ్లారు.
 
 ఆనందం.. అంతలోనే ఆవిరి
 ఇంద్రవెల్లి మండలం గోండుగూడకు చెందిన పవన్ జైస్వాల్ కిరాణ దుకాణం నడుపుతూ భార్య, తల్లి, సోదరులతో నివసిస్తున్నాడు. ఏడాది కిందట సరిగ్గా ఇదేరోజు అంటే 2013 జూన్ 5న ఆయనకు శీతల్‌తో వివాహమైంది. గురువారం పెళ్లిరోజు కావడంతో భార్య శీతల్, తల్లి నిర్మల జైస్వాల్, వరుసకు సోదరులు, బంధువులతో కలిసి ఉట్నూర్‌కు పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. శీతల్ ఎనిమిది నెలల గర్భిణీ. మరో నెల దాటితే తమకు బిడ్డ పుడతాడని ఆనందంతో ఉన్నారు. శీతల్‌కు తీవ్రగాయాలు కావడంతో గర్భస్రావమైంది. పెళ్లిరోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
 
 భర్త మరణించినా కుటుంబాన్ని పోషిస్తూ..

 నిర్మల జైస్వాల్ భర్త బాబు జైస్వాల్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అయిన నిర్మల ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్‌గూడాలో కిరాణ దుకాణం నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. కొద్ది రోజుల క్రితమే కూతురు ప్రియాంకకు మహారాష్ర్టలోని కుఫ్టీ గ్రా మ యువకునితో వివాహం జరిపించింది. నిర్మలకు మరో సంతానం పవన్ ఉన్నారు. కిరాణా దుకాణంలో తల్లికి చేదోడువాదుడుగా ఉంటాడు. నిర్మల మృతితో కుటుంబంలో చీకటి అలుముకుంది.
 
 బంధువుల ఇంటికి వచ్చి..
మహారాష్ట్రంలోని కుఫ్టీ గ్రామానికి చెందిన కాంత ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఉండే బంధువుల ఇంటికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. నిర్మల కూమార్తె ప్రియాంకకు స్వయాన అత్త అయిన ఈమె తమ కోడలిని తీసుకెళ్లేందుకు ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వచ్చింది. శ్యాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది.
 
 ఆశల దీపం ఆవిరి
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్‌గూడాకు చెందిన దిలీప్‌కుమార్-సీమ దంపతులకు ము గ్గురు సంతానం. సాయి, సోను, రోష్న. దిలీప్‌కుమార్ గోండ్‌గూడాలోనే కిరాణం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎంతో ఆనందంగా గడుపుతున్న కుటుంబంలో సాయి మృతి విషాదం నింపింది. చదువులో చురుకుగా ఉండే సాయి ఇంద్రవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
 
 రిమ్స్‌లో హాహాకారాలు
 మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రమాదం జరుగగా సాయంత్రం నాలుగు గంటలకు రిమ్స్‌కు క్షతగాత్రులు వాహనంలో వచ్చారు. ఆటో ట్రాలీలో ఇరుకున్న వారిని బయటకు తీయడానికి గంటన్నరకు పైగా పట్టడంతో జాప్యం జరిగింది. ఆస్పత్రిలో నిర్మల జైస్వాల్, కాంతాబాయి, సాయి మృతిచెందడంతో వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పవన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సోను రెండు కాళ్లకు దెబ్బలు తగలడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పవన్ సోదరి ప్రియాంక పైకి గాయాలు కనిపించినా ఆమె స్పృహలో లేదు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో డాక్టర్ తిప్పస్వామితోపాటు పలువురు వైద్యులు వారికి చికిత్స అందజేశారు. సోను, దయాకర్‌ల పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ నిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు.
 
కలెక్టర్ పరామర్శ
కలెక్టర్ అహ్మద్‌బాబు రిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హైదరాబాద్ నిమ్స్‌కు తరలించే విషయంలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి వారిని నిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యులతో ఫోన్‌లో సంప్రదించారు. మిగితా క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement