ఆపద్‌బంద్ | Road accident man File RTO Pending in Nilgiri | Sakshi
Sakshi News home page

ఆపద్‌బంద్

Published Mon, Oct 20 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

Road accident man File RTO Pending in Nilgiri

 తిప్పర్తి మండలం వెంకట్రాదిపాలానికి చెందిన  పులిచింతల సంతోష్ రెడ్డి గతేడాది మార్చి 29న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇతనికి సంబంధించిన ఫైల్ ఆర్డీఓ నుంచి కలెక్టరేట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 29న వచ్చింది. అంటే వ్యక్తి మృతిచెందిన ఏడాది తర్వాత ఫైల్ పంపడం వల్ల ఆపద్బంధు కింద పొందాల్సిన సాయం కోల్పోవాల్సి వచ్చింది.
 
 నీలగిరి : వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆపద్బంధు పథకం ఆగిపోయింది. ఇంటి పెద్దనో.. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారు ప్రభుత్వం అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశగా దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. ఇంటి వ్యక్తి చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే..అటు అధికారుల తీరుతో బాధిత కుటుంబాలు మరింత కుంగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ మృతులు, ఇతర ప్రమాదాలబారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆపద్బంధు పథకం కింద రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందుతుంది.
 
 నిబంధనల ప్రకారం అయితే మరణించిన వ్యక్తి కుటుంబాలకు తక్షణమే ఈ పథకం కింద ఆర్థికసాయం అందించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి వే చి చూడాల్సి వస్తోంది. పలు సందర్భాల్లో ఈ దరఖాస్తులను ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాల్సి వస్తోంది. తద్వార బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ దరఖాస్తులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించడం ద్వారా కేవలం రూ.20 వేలు మాత్రమే వారికి అందుతుంది. ప్రతి ఏడాది నవంబర్ 1 తేదీ నుంచి తర్వాతి ఏడాది నవంబర్ 2 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆపద్బంధు పథకం కింద వర్తింపజేస్తారు. ఈ గడువు దాటిని తర్వాత ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు.
 
 అధికారుల అలసత్వం...
 2013-14 సంవత్సరానికిగాను జిల్లావ్యాప్తంగా ఆపద్బంధు పథకం కింద 224 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పంపడంలో తహసీల్దార్లు, ఆర్డీఓలు తీవ్ర జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్డీఓల నుంచి వచ్చిన ఫైళ్లపై కలెక్టరేట్ అధికారులు లేనిపోని కొర్రీలు పెట్టి మరింత జాప్యం చేస్తున్నారు. అధికారులు చేస్తున్న ఇలాంటి తప్పిదాల వల్ల జిల్లాలో 25 దరఖాస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ కు మళ్లించాల్సి వచ్చింది.
 
 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రద్దు
 ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.16 లక్షల చెక్కులు ర ద్దయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 56 కుటుంబాలకు చెందిన చెక్కులు రద్దు అయినట్లు తెలుస్తున్నప్పటికీ అనధికారికంగా ఈ మొత్తం ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు సీఎం సహాయం నిధి కింద జిల్లాకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ చెక్కుల కాలపరిమితి నెలరోజుల మాత్రమే ఉంటుంది. ఎన్నికల హడావిడి కారణంగా బాధిత కుటుంబాలకు చెక్కులు జారీ కావడంలో జాప్యం జరిగింది. దీంతో ఈ నిధికి మంజూరైన సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపారు. చె క్కుల కాలపరిమితి ముగియడంతో బ్యాంకర్లు కూడా ఆ చెక్కులు చెల్లవని చెప్పారు. దీంతో సీఎం సహాయ నిధి కోసం బాధిత కుటుంబాలు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నా అధికారుల్లో ఏమాత్రమూ చలనం లేకుండా పోయింది.
 
 కుటుంబ పోషణ భారంగా మారింది
 నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబాన్ని పోషించే కుమారుడు మరణించడం వల్ల పోషణ భారంగా మారింది. నా పెద్ద కొడుకు ఓ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వాహనాల టైర్లకు పంక్చర్లు అతికిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసి నాలుగు మాసాలు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు.  
 - శివలింగాచారి, మర్రిగూడ,
 నల్లగొండ
 
 అప్పుల బాధ వెంటాడుతోంది
 నా భర్త యాదయ్య రోడ్డు ప్రమాదంలో మరణించి పది మాసాలైంది. నాటినుంచి మా కుటుంబం అప్పులబాధతో ఆర్థిక స మస్యలు ఎదుర్కొంటున్నాను. మా అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆపద్బంధు పథకం ద్వారా వెంటనే డబ్బులు వస్తాయని అధికారులు చెప్పారు. రెండుసార్లు ఇంటికి వచ్చి వివరాలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాల యానికి రావాలని చెప్పి వెళ్లారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు.
 - వై.యశోద, నెమ్మాని, నార్కట్‌పల్లి మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement