
ఘటనాస్థలంలో వాహనం నుంచి పడిపోయిన నసీరొద్దీన్ మృతదేహం డ్రైవర్ సలీం మృతదేహం
దిలావర్‌పూర్(నిర్మల్): దిలావర్‌పూర్ పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన శేఖ్ సలీం(25), నసీరొద్దీన్(42) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి ఎడ్లబండి చక్రాలను బొలెరో వ్యాన్‌లో వేసుకుని ఆసిఫాబాద్‌లోని ఓ షాపులో విక్రయించేందుకు డ్రైవర్ శేక్ సలీంతోపాటు అతనికి తోడుగా నసీరొద్దీన్‌లు బయల్దేరారు. ఉదయం ఆరు గంటల సమయంలో దిలావర్‌పూర్ పాతబస్టాండ్ దాటాక రోడ్డు పక్కనే ఉన్న భారీ క్రేన్‌ను తప్పించబోయి వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో బొలేరో డ్రైవర్ శేక్ సలీంతోపాటు పక్కనే కూర్చున్న నసీరొద్దీన్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
నసీరొద్దీన్ మృతదేహం రోడ్డుపై ఎగిరి పడగా డ్రైవర్ సలీం మృతదేహం వాహనంలో ఇరుక్కుపోయింది. లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారై స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, రూరల్‌సీఐ జీవన్‌రెడ్డి, దిలావర్‌పూర్ ఎస్సై హరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నుజ్జునుజ్జు అయిన వాహనం ముందు భాగంలో డ్రైవర్ సలీం మృతదేహం ఇరుక్కుపోగా పోలీసులు బయటకు తీశారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఘటనకు కారణమైన భారీ క్రేన్
దిలావర్‌పూర్ పాత బస్టాండ్ సమీపంలో నిర్మల్, భైంసా రహదారిపై సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్న భారీ క్రేన్ పాడైపోవడంతో రోడ్డుపక్కనే ఉంచారు. మరమ్మతుల కోసం టెక్నీషియన్ రాకపోవడంతో మంగళవారం తెల్లజామువారు వరకు క్రేన్ అక్కడే ఉండిపోయింది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా భారీ క్రేన్‌ను నిలిపి ఉంచడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో క్రేన్ డ్రైవర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బొలెరో వాహనం
Comments
Please login to add a commentAdd a comment