డిసెంబర్‌ 11న దిమ్మతిరిగే ఫలితాలు  | Roadshow Organized Constituency Chevella In Ranga Reddy District KTR | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 11న దిమ్మతిరిగే ఫలితాలు 

Published Thu, Nov 29 2018 8:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Roadshow Organized Constituency Chevella In Ranga Reddy District KTR - Sakshi

శంకర్‌పల్లిలో జరిగిన రోడ్‌షోలో  మాట్లాడుతున్న కేటీఆర్‌

చేవెళ్ల, శంకర్‌పల్లి: డిసెంబర్‌ 11 ఫలితాల తరువాత కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ వీణ వాయిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చోవాల్సిన సమ యం ఆసన్నమైందని మంత్రి కె.తారకరామరావు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సభల్లో మాట్లాడుతూ..   పాము ముంగిసలాంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమైయ్యాయని, కేసీఆర్‌ను ఓడించాలని చూస్తున్నాయన్నారు.

చంద్రబాబు ఢిల్లీకిపోయి రాహుల్‌గాంధీకి వీణ ఇస్తే,  చంద్రబాబుకు ఆయన ఫిడేల్‌ ఇచ్చారన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్‌ గెలిచి  ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేస్తుంటే వీరిద్దరు ఒకరు వీణ మరోకరు ఫిడేల్‌వాయించు కోవాల్సిందేనన్నారు.  పనిచేసే ప్రభుత్వా న్ని, ముఖ్యమంత్రిని ఏ ప్రజలూ వదులుకోరన్నా రు. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి.. తెలం గాణలో కరెంట్‌ వస్తలేదని పచ్చి అబద్ధాలు చెప్పాడన్నారు.

దమ్ముంటే బీజేపీ నాయకులు  విద్యుత్‌ తీగలు పట్టుకుంటే 24గంటల విద్యుత్‌ ఉన్నది తెలుస్తుందని ఛాలెంజ్‌ చేశారు. తాము బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నామని, ఎక్కడా అవినీతి పాల్పడలేదన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్న సోనియాగాంధీ 60  సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ఎవరి కుటుంబం అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు సేవ చేస్తున్నామని గుర్తుకు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో ఉందని కేటీఆర్‌ చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు పెంచుకొని సన్యాసంలో కలిసిపోయో రోజు వచ్చిందని, గడ్డాలు పెంచినోళ్లు అందరూ గబ్బర్‌ సింగ్‌లు కాలేరని ఏద్దెవా చేశారు. 


సినిమా డైలాగ్‌లతో ఉత్తేజం 
చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెలిసిన సౌమ్యుడు, వజ్రంలాంటి మనిషి యాదయ్యను గెలిపించుకోవాలన్నారు. ఒక సినిమాలో వచ్చిన పాట మాదిరిగా.. చేవెళ్ల ప్రాంతంలో ఉన్న యాదన్నలు, వెంకన్నలు, నాగన్నలు, అందరూ ఏగట్టున ఉంటారో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింన్నా రు. కరెంట్‌ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, టీడీపీ ల దిక్కు ఉందామా.. అడగకముందే  24 గంటల కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ వైపు ఉందామా, నీల్లు అడిగితే కన్నీళ్లు ఇచ్చిన కాంగ్రెస్‌ వైపు ఉందామా.. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌ దిక్కు ఉం దామా ఆలోచించాలని కేటీఆర్‌ ప్రజలను కోరారు. స్కామ్‌ల వైపు ఉందామా.. స్కీమ్‌ల వైపు ఉం దామా, సంక్షోంభం దిక్కు ఉందామా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.

ఈ కుటమి పొరపాటునో గ్రహపాటునో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని   రాహుల్‌గాంధీ కాదు చంద్రబాబు డిసైడ్‌ చేస్తాన్నారు.  మన వనరులు, మన నీళ్లుపై ఆధిపత్యం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. డిల్లీ గులామ్‌లు, అమరావతి కీలుబొమ్మలు వీళ్లు కావాలా.. తెలంగాణలోని గులాబీలు కావాలో ఆలోచించుకోవాల్సిన  అవసరం వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. చేవెళ్ల రోడ్‌షోలో ఎంపీపీ ఎం.బాల్‌రాజ్,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పోలీస్‌ వెంకట్‌రెడ్డి, నర్సింగ్‌రావు,  ఉపాధ్యక్షుడు పాండుయాదవ్,  మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బి.నర్సింలు, మాజీ వైస్‌ చైర్మన్‌ మాసన్నగారి మానిక్యరెడ్డి, జిల్లా యువజన విభాగం నాయకులు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బర్కాల రాంరెడ్డి,  మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు మిట్ట లతావెంకటరంగారెడ్డి,  గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమి టీ డైరెక్టర్‌ ఎం.యాదగిరి, నియోజకవర్గం యూత్‌ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  


111 జీవోను సడలించేందుకు చర్యలు 
మొయినాబాద్‌(చేవెళ్ల): మొయినాబాద్‌ మండలం హైదరాబాద్‌ నగరానికి అత్యంత చేరువలో ఉంది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు నిండిపోయాయి. బుద్వేల్‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. తరువాత మొయినాబాద్‌ మండలంలోనే ఏర్పాటవుతాయి. అందుకోసం పర్యావరణానికి నష్టం లేకుండా 111 జీవోను సడలించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి మొయినాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని 84 గ్రామాలకు ఇబ్బందిగా మారిన 111 జీవోపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని.. కమిటీ తుదినివేధిక కూడా అందజేసిందన్నారు. గ్రామాల అభివృద్ధికోసం 111 జీవోను సడలించేందుకు కృషిచేస్తామన్నారు. ఆ నాడు తెలంగాణ వస్తే రియల్‌ ఎస్టేట్‌ పోతుందని కొంత మంది నాయకులు అన్నారు. కానీ నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 17 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. 


ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన యాదిరెడ్డి... 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారన్నారని కేటీఆర్‌ అన్నారు. మొయినాబాద్‌ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన యువకుడు యాదిరెడ్డి ఢిల్లీలో పార్లమెంటు ముందు ఉరివేసుకుని ప్రాణత్యాగం చేసుకున్నాడని.. అలాంటి అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. నాలుగున్నరేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రుణమాఫీ, 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్లు, రైతు బందు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ వంటి అనేక పథకాలతో ఎంతో మందికి లబ్ధి చేకూరిందన్నారు.

ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఈ పథకాలన్నీ అమలు కావాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి కాలె యాదయ్యను గెలిపించాలని.. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలన్నా రు. చేవెళ్ల అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కాలె యాద య్య, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీహరియాదవ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఎంసీ వైఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ పెంటయ్య, రవుఫ్, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement