రాష్ర్టేతర అధికారుల పంపిణీకి డ్రా తీసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తించిన రాష్ర్టేతర కేడర్ల సివిల్ సర్వీసు అధికారుల పంపకంలో రోస్టర్ పాయింట్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. ఆయా అధికారుల పంపిణీ కోసం రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలన్నదానిపై శనివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యూష్‌సిన్హా కమిటీ డ్రా తీసింది. తెలంగాణ పేరు రావడంతో..ఆ రాష్ట్రంనుంచే రోస్టర్ పాయింట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది.ఈ విధానం అమలు చేస్తున్నందున.. ఇంతకుముందు చేసిన ప్రొవిజనల్ కేటాయింపులో పూర్తి మార్పులు చేర్పులు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. దాని ప్రకారం సీఎస్, డీజీపీ స్థాయి అధికారుల కేడర్‌లో మార్పులు జరిగే అవకాశముందని అంటున్నారు.సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపుపై మరోసారి సమావేశం జరిపాక వచ్చే శనివారం జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రత్యూష్‌సిన్హా కమిటీతో పాటు ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధి రేమండ్ పీటర్, ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు మాలకొండయ్య, శివధర్‌రెడ్డి, ఉమేశ్‌షరాఫ్, ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు చోట్‌రాయ్, అక్బర్ హాజరయ్యారు.
కొద్దిరోజుల్లోనే కేటాయింపు: రేమండ్ పీటర్
సివిల్ సర్వీసుల అధికారులను కొద్ది రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తారని.. దీనిపై శనివారం తుది నిర్ణయం తీసుకుని జాబితా విడుదల చేసే అవకాశముందని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధి రేమండ్ పీటర్ తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రోస్టర్ పాయింట్‌ను ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలన్న అంశం తేల్చేందుకు తీసిన లాటరీకి... రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘాలను ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఆహ్వానించిందని తెలిపారు.ఆవివరాలను వెల్లడించారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక అధికారుల కేటాయింపులో ఏదైనా రాష్ట్రానికి నిర్ధారిత సంఖ్య కంటే ఎక్కువగా స్థానిక కేడర్ అధికారులు వస్తే.. మరో రాష్ట్రానికి పంపిస్తారు. ఇందులోనూ రోస్టర్ విధానాన్ని పాటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 37 మంది అవసరం. కానీ డెరైక్ట్ రిక్రూట్‌లో 51 మంది ఉన్నారు. ఎక్కువగా ఉన్న 14 మంది వారు తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుంది. వారిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రకారం తీసుకుంటారు. అధికారుల కేటాయింపుపై వచ్చే శనివారం ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో సమావేశమయ్యాక జాబితా విడుదల చేస్తారు. వారం రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం రోస్టర్ ప్రకారం మార్పులు జరుగుతున్నందున కేడర్ కేటాయింపును బట్టి సీఎస్, డీజీపీ సహా కొందరు ఉన్నతాధికారులు మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వారు తమకు కావాలనుకుంటే కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంది’’ అని చెప్పారు.
కేటాయింపు ఇలా..
సివిల్ సర్వీసెస్ అధికారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే... వారిని రోస్టర్ విధానంలో తెలంగాణ, ఏపీలకు కేటాయిస్తారు. అయితే ఇందులో అధికారుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారు. అధికారులెవరైనా కేటాయించిన చోటుకు వెళ్లలేమని చెబితే.. అక్కడికి వెళ్తామంటూ ఆప్షన్లు ఇచ్చిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. లేకపోతే ఆ అధికారికి చెందిన బ్యాచ్‌లో ఇంకెవరైనా అధికారి ముందుకొస్తే వారిని పంపుతారు.
ఇక ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారిని.. సర్వీసు రికార్డుల్లోని వారి స్వస్థలానికి చెందిన రాష్ట్రానికి కేటాయిస్తారు. ఈ కేటాయింపులో ఏదైనా రాష్ట్రానికి నిర్ధారిత సంఖ్య కంటే ఎక్కువగా స్థానిక కేడర్ అధికారులు (డెరైక్ట్ రిక్రూటీ అయినా లేక కన్ఫర్డ్ అయినా) ఉంటే... వారిని తక్కువ సంఖ్యలో అధికారులున్న రాష్ట్రానికి కేటాయిస్తారు. ఇందుకోసం రెండు మూడు రోజుల్లో రోస్టర్‌ను ఖరారు చేస్తారు.
తెలంగాణ నుంచి రోస్టర్
Published Sun, Aug 17 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement