సాక్షి, హైదరాబాద్ : మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముగ్గురికి యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. రోబోటిక్ సహాయంతో వీరికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు. బాధితుల్లో ఒకరికి అతని తల్లి కిడ్నీ దానం చేయగా.. మరో ఇద్దరికి వారి సతీమణులు కిడ్నీలను ఇచ్చారు. ప్రస్తుతం కిడ్నీ స్వీకర్తలు, దాతలు ఇద్దరూ కోలుకున్నారని, వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, యూరాలజిస్ట్ డాక్టర్ సూరిబాబు, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఊర్మిళా ఆనంద్ సర్జరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చిలో ప్రస్తుతం ఈ తరహా శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సర్జరీలు నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు.
ఒక్కో సర్జరీకి ఎనిమిది గంటలు..
వరంగల్‌కు చెందిన రాజు కొంగ(35) మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాది నుంచి దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. చికిత్స కోసం రాజు ఇటీవల యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఊర్మిళా ఆనంద్‌ను సంప్రదించగా.. అక్టోబర్ 6న అతనికి రోబోటిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రాజు తల్లి మల్లికాంబ(70) అతనికి కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
ఇక ఇలాంటి సమస్యతోనే బాధపడుతూ యశోద ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్ కుర్రే(38)కు అక్టోబర్ 7న సర్జరీ చేశారు. అజయ్ భార్య జ్యోత్రి తన కిడ్నీని భర్తకు దానం చేసింది. ఇక ఢిల్లీలోని హోటల్ మేనేజ్‌మెంట్ అధ్యాపకుడు(40) కూడా ఇలాంటి సమస్యతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు అక్టోబర్ 16న శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయనకు కూడా భార్యే కిడ్నీ దానం చేశారు. ఒక్కో సర్జరీకి డాక్టర్ సూరిబాబు, డాక్టర్ సురేశ్‌బాబు నేతృత్వంలోని బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు.
చిన్న గాటే.. నో ఇన్‌ఫెక్షన్
రోబో సహాయంతో చేసే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను శరీరంపై కేవలం 3 అంగుళాల చిన్న గాటుతో పూర్తి చేయవచ్చని డాక్టర్ సూరిబాబు చెప్పారు. రోబోటిక్ సాయం తీసుకోవడంతో శరీరం లోపల ఉండే చిన్నచిన్న భాగాలు కూడా పది రెట్లు పెద్దవిగా కనిపిస్తాయని, అందువల్ల ముఖ్యమైన శరీర భాగాలకు నష్టం వాటిల్లకుండా శస్త్రచికిత్స పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. తక్కువ రక్తస్రావం, నొప్పి ఉంటాయని, శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం చాలా తక్కువని చెప్పారు. సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ఖర్చు కూడా తక్కువని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment