Robotic surgery
-
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం నుంచి రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.31.50 కోట్లతో నిమ్స్ కొనుగోలు చేసిన డావెన్నీ ఎక్స్ఐ రోబో యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోబోటిక్ సర్జరీల నిర్వహణకు నిమ్స్ యాజమాన్యం ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోబోటిక్ సర్జరీ సిస్టంతో పాటుగా స్పెషా లిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలనూ మంత్రి ప్రారంభించనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. కార్పొరేట్ ఆస్పత్రులలో సుమారు రూ.1.75 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్న ఈ రోబోటిక్ సర్జరీలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయనున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా నూటికి నూరు శాతం ఉంటుంది. క్లిష్టమైన మూత్రాశయం, పెద్దపేగు, చిన్న పేగు, క్లోమం, కాలేయం, గర్భసంచి, అన్నవాహిక.. తదితర సర్జరీలను రోబో విధానంలో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. అతి సూక్ష్మమైన కేన్సర్ కణతులను సైతం తొలగించడానికి వీలుంటుంది. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గైనకాజీ విభాగాల్లో మరింత మెరుగైన శస్త్ర చికిత్సలు చేయడానికి వీలుంటుంది. వైద్య సేవల్లో దేశానికే రోల్‌మోడల్ : నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వైద్య సేవల్లో నిమ్స్ ఆస్పత్రి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేస్తున్నామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా రోగి మూడో రోజునే ఇంటికి వెళ్లే విధంగా దోహదపడే రోబోటిక్ సిస్టంను సమకూర్చుకున్నామన్నారు. స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ సర్జరీ సిస్టంను ప్రస్తుతానికి సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ విభాగాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డాక్టర్ బీరప్ప తెలిపారు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సాధించనుంది. అవయవ మార్పిడి నోడల్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపు, టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో ఆరునెలల్లో అత్యాధునిక హైఎండ్ మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, తుంటి ఎముక, మోకాళ్లు వంటి అవయవ మార్పిడి, మూగ, చెవుడు, వినికిడిలోపం గల చిన్నారులకు కాక్లియర్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక ఆపరేషన్ థియేటర్లను గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్థులో నిర్మించనున్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న రోగికి ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. గాంధీలో అవయవ మార్పిడి థియేటర్ల కోసం ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వైద్య మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో సాకారం అయ్యేదిశగా ముందడుగు పడింది. ► గాంధీఆస్పత్రి 8వ అంతస్తులో అందుబాటులో ఉన్న సుమారు లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో రూ.35 కోట్ల వ్యయంతో ఆరు హైఎండ్ మాడ్యులర్ థియేటర్లను నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న నర్సింగ్ స్కూలు, హాస్టల్, నర్సింగ్, నన్ సిస్టర్స్ క్వార్టర్స్‌ను ఇతర ప్రదేశాలకు తరలించారు. ► అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ ఆపరేషన్ థియేటర్లు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూటికి నూరుశాతం ఉండటంతో సర్జరీల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లోని గాలిని పరిశుభ్రం చేసేందుకు లామినార్ ఫ్లో, వైరస్, బాక్టీరియాలను నాశనం చేసేందుకు హెఫాఫిల్టర్స్ను వినియోగిస్తారు. ► మాడ్యులర్ థియేటర్లకు అనుసంధానంగా ఐసీయు, స్టెప్‌డౌన్ వార్డులు, రోగులను సిద్ధం చేసేందుకు కౌన్సిలింగ్ విభాగం, సర్జరీ అనంతరం పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తారు. నిష్ణాతులైన వైద్య, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ► ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగుతున్న సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని గాంధీకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రోబోటిక్ సర్జరీలు నిర్వహించేందుకు సంబంధిత వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ► ‘హైఎండ్ మాడ్యులర్ ధియేటర్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కివచ్చింది. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ నేతృత్వంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రోబోటిక్, మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్జరీలు చేయడం, వీక్షించే అవకాశం కలుగుతుంది’ అని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (క్లిక్: Omicron BF.7 ముంచుకొస్తున్న నాలుగో వేవ్?!) -
ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తులకు చిన్న కోతతోనే శస్త్రచి కిత్స చేసే ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా పేరుపొందిన రోబో టిక్ సర్జరీ నిపుణులు స్పెయిన్‌కు చెందిన డిగో గొన్జాల్స్ రివాజ్, రొమేనియాకు చెందిన ముగురేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుడు మంజునాథ్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఆసియా లోనే తొలిసారిగా ఒకే చిన్న కోతతో చేసే సర్జరీని అందుబాటులోకి తెచ్చా మన్నారు. ఊపిరితి త్తులకు ఇన్ఫెక్షన్లు, కేన్సర్ సోకినప్పుడు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేస్తే వేగంగా కోలుకుంటారని తెలిపారు. చిన్నపాటి గాయమే కావడం వల్లే ఏ వయసువారికైనా ఈ విధానంలో శస్త్రచికిత్స చేయవ చ్చని.. ఇటీవల ఊపిరి తిత్తుల కేన్సర్‌తో బాధప డుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి అపోలో ఆస్పత్రిలో విజయ వంతంగా ఈ శస్త్రచికిత్స చేశామని వెల్లడిం చారు. రోబోటిక్ వైద్య సేవలు సమీప భవిష్యత్తులో విస్తరించ నున్నాయని వైద్యులు తెలిపారు. -
‘ఆపరేషన్’ రోబో..!
రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలివే.. ♦ తక్కువ కోత పెట్టి, అతి స్వల్ప రక్తస్రావంతో, తక్కువ సమయంలోనే శస్త్రచికిత్స పూర్తి చేయడం ♦ ఆపరేషన్ తర్వాతత్వరగా రోగి కోలుకోవడం ♦ సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే ఇన్షెక్షన్ రేటు,నొప్పి తక్కువ ♦ ఇన్‌పేషెంటుగా ఎక్కువ రోజులు ఆస్పత్రిలోఉండాల్సిన అవసరం లేదు ♦ దీనివల్ల ఇన్‌పేషెంటు ఖర్చులు భారీగా తగ్గే అవకాశం సాక్షి, అమరావతి: కొంతకాలం క్రితం వరకు కూడా ఎవరైనా రోగికి ఆపరేషన్ చేయాలంటే.. అవసరమైన చోట శరీరాన్ని కోసి, కత్తితో గాట్లు పెట్టి చేసేవారు. ప్రస్తుతం చేతికి ఒక చుక్కరక్తం కూడా అంటకుండానే శస్త్రచికిత్స పూర్తి చేసి, రోగికి జబ్బు నయం చేస్తున్నారు నేటి వైద్యులు. ఈ క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. తాజాగా రోబోటిక్ శస్త్రచికిత్సల వైపు వీరి దృష్టి మళ్లింది. వీటిపై అవగాహన పొందేందుకు ఏటా మనదేశం నుంచి 3 వేల మందిపైనే పాశ్చాత్య దేశాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీలకు రోగులు అంగీకరిస్తున్న నేపథ్యంలో యువ వైద్యులు ఆ శస్త్రచికిత్సల వైపు అడుగులేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ ఇలా.. రోబోటిక్ సర్జరీ అత్యంత సులువుగా ఉంటుందనివైద్యులు చెబుతున్నారు. వైద్యుడు రెండు చేతులతో చేస్తే రోబో నాలుగు చేతులతో పనిచేస్తుంది. డాక్టర్లు కత్తులు, కత్తెర్లు చేతబట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రోబో చూసుకుంటుంది. అయితే ఓ కంప్యూటర్ వద్ద వైద్యుడు కూర్చుని రోబోకు కమాండ్స్ ఇస్తూ పర్యవేక్షిస్తుంటారు. కంప్యూటర్లో డాక్టర్ ఇచ్చే సూచనలకనుగుణంగా రోబో పనిచేస్తుంది. నాలుగు చేతులున్న కంప్యూటర్ 360 డిగ్రీల కోణంలో రోగి శరీరం చుట్టూ ఎలాగైనా తిరిగి సర్జరీ చేయగలదు. రోబో చేతులకు అమర్చిన 3డి కెమెరాలు డాక్టర్‌కు కంప్యూటర్లో అత్యంత స్పష్టతతో చిత్రాలను చూపిస్తూ ఉంటాయి. మొత్తం కమాండ్స్ మీదే వ్యవస్థ పనిచేస్తుంది. డాక్టర్ నిర్ణయించిన సమయంలోగా రోబో సర్జరీ పూర్తిచేస్తుంది. ప్రత్యేక సర్జరీ ప్రోగ్రాంతో రూపొందించిన రోబో ఇప్పుడు రూ.12 కోట్లకు లభ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోబోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీలు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోబో ఉండగా, హైదరాబాద్‌లో యశోద, కిమ్స్, అపోలో, ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రోబోలు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యయం చేయలేకపోవడం, శిక్షణ పొందిన వైద్యులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం కాలేదు. రోబోలను తయారుచేస్తున్న కంపెనీలే ఇక్కడి డాక్టర్లకు విదేశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 40 నుంచి 50 మంది వైద్యులు విదేశాల్లో రోబోటిక్ సర్జరీలో శిక్షణ పొందుతున్నట్టు అంచనా. ఎక్కువగా యూరాలజీ, క్యాన్సర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. త్వరలోనే మిగతా శస్త్రచికిత్సలకూ ఈ విధానాన్నే అమల్లోకి తెచ్చే పనిలో వైద్యులు ఉన్నారు. ల్యాప్రోస్కోపీ తర్వాత ఇదే ఉత్తమ పద్ధతి ఇన్నాళ్లూ ల్యాప్రోస్కోపీ పద్ధతే అత్యాధునికం. పెద్ద పెద్ద కోతల నుంచి ల్యాప్రోస్కోపీ ద్వారా రోగులకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఆ స్థానాన్ని రోబోలు ఆక్రమించాయి. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే రోబోలకు సూచనలు చేయగలరు. యువ వైద్యులు ఎక్కువగా దీనిపై దృష్టి సారిస్తున్నారు. సర్జన్లు కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఉపయోగం ఉంటుంది. – డా.హరిచరణ్, జనరల్ సర్జన్, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
రోబో సర్జరీ.. కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్ : మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముగ్గురికి యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. రోబోటిక్ సహాయంతో వీరికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు. బాధితుల్లో ఒకరికి అతని తల్లి కిడ్నీ దానం చేయగా.. మరో ఇద్దరికి వారి సతీమణులు కిడ్నీలను ఇచ్చారు. ప్రస్తుతం కిడ్నీ స్వీకర్తలు, దాతలు ఇద్దరూ కోలుకున్నారని, వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, యూరాలజిస్ట్ డాక్టర్ సూరిబాబు, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఊర్మిళా ఆనంద్ సర్జరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చిలో ప్రస్తుతం ఈ తరహా శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సర్జరీలు నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ఒక్కో సర్జరీకి ఎనిమిది గంటలు.. వరంగల్‌కు చెందిన రాజు కొంగ(35) మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాది నుంచి దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. చికిత్స కోసం రాజు ఇటీవల యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఊర్మిళా ఆనంద్‌ను సంప్రదించగా.. అక్టోబర్ 6న అతనికి రోబోటిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రాజు తల్లి మల్లికాంబ(70) అతనికి కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఇలాంటి సమస్యతోనే బాధపడుతూ యశోద ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్ కుర్రే(38)కు అక్టోబర్ 7న సర్జరీ చేశారు. అజయ్ భార్య జ్యోత్రి తన కిడ్నీని భర్తకు దానం చేసింది. ఇక ఢిల్లీలోని హోటల్ మేనేజ్మెంట్ అధ్యాపకుడు(40) కూడా ఇలాంటి సమస్యతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు అక్టోబర్ 16న శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయనకు కూడా భార్యే కిడ్నీ దానం చేశారు. ఒక్కో సర్జరీకి డాక్టర్ సూరిబాబు, డాక్టర్ సురేశ్‌బాబు నేతృత్వంలోని బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. చిన్న గాటే.. నో ఇన్ఫెక్షన్ రోబో సహాయంతో చేసే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను శరీరంపై కేవలం 3 అంగుళాల చిన్న గాటుతో పూర్తి చేయవచ్చని డాక్టర్ సూరిబాబు చెప్పారు. రోబోటిక్ సాయం తీసుకోవడంతో శరీరం లోపల ఉండే చిన్నచిన్న భాగాలు కూడా పది రెట్లు పెద్దవిగా కనిపిస్తాయని, అందువల్ల ముఖ్యమైన శరీర భాగాలకు నష్టం వాటిల్లకుండా శస్త్రచికిత్స పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. తక్కువ రక్తస్రావం, నొప్పి ఉంటాయని, శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం చాలా తక్కువని చెప్పారు. సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ఖర్చు కూడా తక్కువని తెలిపారు. -
లింగ్వల్ థైరాయిడ్‌కు రోబోటిక్ సర్జరీ
ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స సాక్షి, న్యూఢిల్లీ: లింగ్వల్ థైరాయిడ్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచి కిత్స నిర్వహించారు. నేపాల్‌కు చెందిన అనూ యాదవ్ అనే యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఈఎన్టీ, రోబో టిక్ సర్జరీలో నిపుణులైన నెల్లూరు జిల్లాకు చెందిన డా.కల్పన నాగ్పాల్రెడ్డిని సంప్రదించారు. ఆమె అనూ యాదవ్‌కు వైద్య పరీక్షలు జరిపి నాలుక భాగంలో పెరిగే థైరాయిడ్ గ్రంథి.. పెరిగాక గొంతు కిందికి రావాల్సి ఉంద ని, అయితే ఈ ప్రక్రియ జరగకపోవడంతో థైరాయిడ్ గ్రం థి నాలుక భాగంలోనే ఉండిపోయింద ని గుర్తించారు. దవడ భాగం తీయకుం డానే రోబోటిక్ సర్జరీని విజయవంతం గా నిర్వహించారు. థైరాయిడ్ గ్రంథిని ఉండాల్సిన స్థానంలోకి తీసుకొచ్చారు. ఇలాంటి వైద్య చికిత్సలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆపోలో ఆస్పత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని డా.కల్పన నాగ్పాల్రెడ్డి తెలిపారు. సర్జరీ అనంతరం ఒక్క గంటలో రోగిని డిశ్చార్జ్ చేస్తామని ఆమె వివరించారు. కల్పన నాగ్పాల్రెడ్డి రోబోటిక్ సర్జరీలో ప్రఖ్యాతిగాంచారు. -
2020 నాటికి చౌకగా రోబోటిక్ సర్జరీలు
రోబోటిక్ సదస్సులో ప్రముఖ ఆంకోసర్జన్ నామ్కిమ్ సాక్షి, హైదరాబాద్: ‘రోబోల తయారీలో అమెరికా కంపె నీలదే గుత్తాధిపత్యం. 2020 నాటికి మరో 3 కంపెనీలు రోబోలను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. వీటి రాకతో రోబో ఖరీదు తగ్గడంతో పాటు ఇప్పటి వరకు వాటి ద్వారా చేస్తున్న చికిత్సల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది’ అని ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొలోరెక్టల్ సర్జరీలు చేసిన ప్రముఖ రోబోటిక్ ఆంకోసర్జన్ డాక్టర్ నామ్కిమ్ చెప్పారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ ఆంకోసర్జరీ (ఎంఐఓఎస్) లైవ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వైద్య రంగంలో రోబోల ప్రవేశంతో క్లిష్టమైన గొంతు, పెద్దపేగు, చిన్నపేగు కేన్సర్‌తో పాటు మెదడు చికిత్సలు సులభమైనట్లు తెలిపారు. రోబోల తయారీలో అమెరికా గుత్తాధిపత్యం కొనసాగుతోందని, వారు నిర్ణ యించిన ధరలకే వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని, పరోక్షంగా ఆ భారం రోగులపై పడుతుందన్నారు. రోబో చికిత్సలకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయకపోవడం, ఖరీదు కావడంవల్ల పేద, మధ్యతరగతి రోగులకు ఈ సేవలు అందడంలేదన్నారు. వేపుళ్లు.. మసాలాల వల్లే... యశోద ఆస్పత్రి రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ... వేపుళ్లు, కాల్చిన మాంసం, మసాలా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్లే మిగతా దేశాలతో పోలిస్తే అధిక శాతం మంది భారతీయులు పెద్ద పేగు కేన్సర్‌కు గురవుతున్నారన్నారు. నగరంలో వారానికి 3 పెద్దపేగు, 2 రొమ్ము, 3 గర్భాశయ, 2 ప్రొస్టేట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.