సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని పదేపదే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెబుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా నగరంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రోడ్ల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు, సిబ్బందిని కేటాయించి దాన్ని రోడ్ల బాగోగులకు పరిమితం చేస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచిస్తోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాజధానిలో రోడ్ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పర్యవేక్షిస్తోంది. దాదాపు 190 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇన్నర్ రింగ్‌రోడ్డు, నగరం మీదుగా సాగే జాతీయ రహదారులను రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. కానీ, రెండు విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో రోడ్ల మరమ్మతు, ఫార్మేషన్ విషయంలో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో వాహనాల ఒత్తిడి అత్యధికంగా ఉండడం, డ్రైనేజీ లీకేజీలు, అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు... తదితరాలతో తరచూ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నిర్ధారిత ప్రమాణాలు, గడువు ప్రకారమే ఆర్‌అండ్‌బీ రోడ్ల మెరుగుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి రోడ్లను తమకు కేటాయిస్తే వాటి బాగోగులు తామే చూస్తామంటూ జీహెచ్‌ఎంసీ ఒత్తిడి చేస్తోంది. రోడ్ల నిర్వహణ లో జీహెచ్‌ఎంసీ ప్రమాణాలు పాటించనందున వీటిని అప్పగించలేమని ఆర్‌అండ్‌బీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు విభాగాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది.
రూ.1,500 కోట్ల పనులు సిద్ధం: రాష్ట్రరాజధానిగా ఉన్న హైదరాబాద్ రోడ్ల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం భాగ్యనగరాన్ని ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలనే దిశగా యోచిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరం పరిస్థితిపై సమీక్షించిన సందర్భంలో మల్టీ లేయర్ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ఆయన ప్రతిపాదించారు. అలాగే నగరం చుట్టూ ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇలా దాదాపు 33 అభివృద్ధి పనులను అధికారులు గుర్తించారు. ఇందుకు రూ.1,487 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ పనులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. వీటితో పాటు, 190 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇన్నర్ రింగ్‌రోడ్డు, నగరం గుండా విస్తరించిన జాతీయ రహదారుల నిర్వహణ... ఈ పనులన్నింటినీ ఈ కొత్త కార్పొరేషన్ పర్యవేక్షిస్తే బాగుంటుందని ఈ సమావేశంలో అభిప్రాయానికి వచ్చారు.
రాజధానికి ‘రోడ్ కార్పొరేషన్’?
Published Wed, Feb 4 2015 4:12 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement