- దేవునూరు, ముప్పారం గ్రామాల్లో కలెక్టర్, జేసీ పర్యటన
- టెక్స్‌టైల్ పార్కుకు స్థల పరిశీలన
ధర్మసాగర్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మండలంలోని దేవునూరు, ముప్పారం శివారు అటవీ భూములను బుధవారం కలెక్టర్ జి.కిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు మూడు కిలోమీటర్లమేర కాలిన నడకన అడవిలో జేసీ పౌసుమిబసు, ఇతర రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నడస్తూ భూములను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేవునూరు, ముప్పారం శివారులో సుమారు 1500 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ఈ భూములతోపాటు జిల్లాలోని జాగారం, తాటికొండ, జనగాం, తాటికొండ తదితర ప్రాంతాల్లో కూడా భూములను పరిశీలించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భూముల సమగ్ర సర్వే అనంతరం పారిశ్రామికశాఖ వారు కూడా భూములను పరిశీలించి టెక్స్‌టైల్ పార్క్‌కు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తారని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఎమ్మార్వో రవిచంద్రారెడ్డి, డీఎఫ్‌ఓ గంగారెడ్డి, డీడీఎఫ్‌ఓ ఆంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ వీరన్న, దేవునూరు, ముప్పారం సర్పంచ్‌లు రాజేంద్ర, వెంకట్రాజం, ఎంపీటీసీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
రాంపూర్ టూ.. ధర్మారం రోడ్డు సర్వే..
గీసుకొండ : సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్‌అండ్ బీ అధికారులు కదిలారు. వరంగల్ నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న రాంపూర్ నుంచి గీసుకొండ మండలం ధర్మారం కోటగండి వరకు 30 కిలోమీటర్ల ప్రధాన రహదారిని సర్వే చేసే పనులను బుధవారం ప్రారంభించారు. ఈ రహదారిని 150 అడుగులకు నిర్మించాలని సీఎం రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీంతో సర్వే పనులను మొదలుపెట్టారు.
అలాగే మండలంలోని వరంగల్-నర్సంపేట రహదారి కోటగండి వద్దకు వచ్చే ఔటర్ రింగ్‌రోడ్డు వంచనగిరి చెరువు కట్టమీదుగా కోట వెంకటాపురం, బొల్లికుంట మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరేలా డిజైన్ రూపొందించారు. ఈ ఔటర్‌రింగ్ రోడ్డుకు అనుసంధానంగా నగరం నుంచి కోటగండి వరకు 150 అడుగుల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు రూపొందించారు.