పాలమూరు ‘కొత్త’ భారం 10,000 కోట్లు
* ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పుతో పెరగనున్న వ్యయం
* రూ.32 వేల కోట్ల నుంచి రూ. 42 వేల కోట్లకు పెరిగిన అంచనాలు
* 4,200 మెగావాట్లకు చేరుతున్న విద్యుత్ అవసరాలు
* శ్రీశైలం నీటిని తరలించేందుకు రిజర్వాయర్లు, లిఫ్ట్‌ల సంఖ్య పెరగడమే కారణం
* వ్యయంపై సర్కారు సందిగ్ధం.. ప్రత్యామ్నాయాలపై దృష్టి
* ఇప్పటివరకు భారీ ప్రాజెక్టు ‘ప్రాణహిత’నే..
* దీని అంచనా వ్యయం రూ. 38,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతో భారీ ప్రాజెక్టుగా చెబుతున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ అంచనా వ్యయాన్ని మించిపోనుంది. అంతేకాదు భారీ స్థాయిలో విద్యుత్ అవసరాలూ పెరిగిపోనున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా రూపొందించిన కొత్త డిజైన్‌లో రిజర్వాయర్లు, లిఫ్టుల సంఖ్య పెరగడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త డిజైన్ ప్రకారం పాలమూరు ప్రాజెక్టును చేపడితే.. నిర్మాణ వ్యయం ఏకంగా రూ.42వేల కోట్లకు, విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. పాలమూరు ప్రాజెక్టుకు తొలి డిజైన్ ప్రకారం రూ.32 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని... 3,300 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. కానీ తాజా డిజైన్‌తో నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరాలు 30 శాతం వరకు పెరగనున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు రూ. 38,500 కోట్లతో భారీ ప్రాజెక్టుగా ఉన్న ప్రాణహిత-చేవెళ్లను పాలమూరు ఎత్తిపోతల పథకం దాటిపోనుంది.
వ్యత్యాసం రూ.10 వేల కోట్లు..
పాలమూరు ప్రాజెక్టు తొలి డిజైన్ మేరకు జూరాల నుంచి వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి... కోయిల్‌కొండ, గండేడు, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు రూ.15,950 కోట్లు, గండేడు వరకు రెండో దశకు రూ.8,650 కోట్లు, లక్ష్మీదేవునిపల్లి మూడో దశకు రూ.7,600 కోట్లతో మొత్తంగా రూ.32,200 కోట్ల వ్యయ అంచనా వేశారు.
ఆ డిజైన్‌తో ముంపు అధికంగా ఉండడంతో.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా కొత్త డిజైన్ రూపొందించారు. శ్రీశైలం నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు 70టీఎంసీల నీటిని తరలించేందుకు 6 రిజర్వాయర్లను (నార్లాపూర్ వద్ద 6 టీఎంసీలు, ఏదుల 3.4, వట్టెం 11, కర్వేని 16, లోకిరేవు 10, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద 10 టీఎంసీలతో) ప్రతిపాదించారు. వీటిని అనుసంధానిస్తూ ఓపెన్ కెనాల్‌లు, సొరంగాలను నిర్మించాలి, 5 చోట్ల ఎత్తిపోయాలి. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికే రూ.9 వేల కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇందులో కర్వేనికి రూ.1,500 కోట్లు, వట్టెంకు రూ.1,400 కోట్ల మేర అంచనా వేశారు. అయితే మొదటి డిజైన్‌తో పోలిస్తే రిజర్వాయర్ల సంఖ్య 3 నుంచి 6కు.. లిఫ్టుల సంఖ్య 3 నుంచి 5కి పెరిగింది, పంపింగ్ రోజులు సైతం 35 నుంచి 60 రోజులకు పెరగడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తంగా మొదటి, రెండు డిజైన్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.10 వేల కోట్లు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
డిజైన్ మార్పుతో అంచనాలన్నీ తారుమారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. వ్యయాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదంతా ఓ కొలిక్కి వచ్చేందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఈ నెల 31న శంకుస్థాపన చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాల వివరాలు
ప్రాణహిత-చేవెళ్ల |
పాలమూరు |
---|---|
160 టీఎంసీలతో 16.40లక్షల ఎకరాలకు నీరు | 70 టీఎంసీలతో 10 లక్షల ఎకరాలకు నీరు |
ప్రయోజనం పొందే జిల్లాల సంఖ్య 7 | మూడు జిల్లాలకు ప్రయోజనం |
ప్రాజెక్టు అంచనా రూ.38,500 కోట్లు | సుమారు రూ.42 వేల కోట్లు |
అవసరమైన విద్యుత్ 3,159 మెగావాట్లు | విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లు |
ప్రాజెక్టు పరిధిలో మొత్తం రిజర్వాయర్లు 12 | పథకంలో ప్రతిపాదించిన రిజర్వాయర్లు 6 |