సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకర్ల కన్సార్షియంకు మధ్య కీలక రుణ ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టు–2కి రూ.11,400 కోట్ల రుణానికి సంబంధించి ఒప్పందం జరిగింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమక్షంలో బ్యాంకర్లు రుణ పత్రాలను నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషికి అందించారు.
రూ.11,400 కోట్ల రుణంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.1,900 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.1,500 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.1,000 కోట్లు, సిండికేట్ బ్యాంక్ 1,000 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంక్ రూ.1,000 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ.1,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.750 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.500 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.500 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.250 కోట్లు సమకూర్చనున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మేలు చేసే మెగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో రుణం అందించిన బ్యాంకర్లను సీఎస్ ఈ సందర్భంగా అభినందించారు. బ్యాంకు రుణాల వల్ల ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని, రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు పాలుపంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. సమావేశంలో ఎస్‌కే జోషితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామ్మోహన్‌రావు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Published Thu, Sep 28 2017 12:55 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement