తాగునీటికి రూ.174 కోట్లు | Rs 174 crore for drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటికి రూ.174 కోట్లు

Published Fri, Oct 17 2014 2:25 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

తాగునీటికి రూ.174 కోట్లు - Sakshi

తాగునీటికి రూ.174 కోట్లు

* ఆర్థిక సంఘం నిధులు కేటాయింపు
* ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
* 25వ తేదీ గడువు

కరీంనగర్ సిటీ : జిల్లాలో 13వ ఆర్థిక సంఘం కింద చేపట్టనున్న పనుల్లో తాగునీటి పథకాలకు పెద్దపీట వేశారు. నాలుగైదు గ్రామాలను కలుపుతూ నిర్మించే సీపీడబ్యూఎస్, గ్రామాల వారీగా నిర్మించే రక్షిత మంచినీటి పథకాలకు కచ్చితమైన కేటాయింపులు ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించింది. ఈ మేరకు 2014-15కు గాను జిల్లాకు రూ.174 కోట్ల 69 లక్షల 72 వేలను ఆర్థిక సంఘం నుంచి కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాకు కేటాయించిన నిధుల్లో జిల్లా పరిషత్ వాటా రూ.34.94 కోట్లు, మండల పరిషత్ వాటా రూ.17 కోట్ల 47 లక్షల 71 వేలు, గ్రామపంచాయతీల వాటా రూ.122.28 కోట్లుగా నిర్ణయించారు. ఆయా విభాగాలకు కేటాయించిన నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది.

 విధివిధానాలివి..
* అధిక భాగం నిధులు వెచ్చించే గ్రామపంచాయతీల్లో సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాలు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పారిశుధ్యం నిర్వహణకు వెచ్చించాల్సి ఉంటుంది.
* మండల పరిషత్ వాటాలో బోర్‌వెల్స్, మండల పరిషత్ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ నిర్వహణ, పాఠశాలలు, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లు, పశువుల ఆసుపత్రి, గోపాలమిత్ర, వ్యవసాయ అనుబంధ భవనాల నిర్మాణాల్లో ఉన్న గ్యాప్‌లను పూర్తిచేయాలి.
* జిల్లా పరిషత్‌లో సీపీడబ్ల్యూఎస్, జెడ్పీ భవనాల నిర్వహణ, గ్రామీణ రోడ్ల నిర్వహణ, వ్యవసాయ, ఆహార పరిశ్రమల ఉన్నతికి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
తొలిసారి భారీ కేటాయింపు
ఏటా విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది భారీగా వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఏటా రెండు విడతల్లో కలిపి రూ.8కోట్లు కేటాయింపులు జరిగేవి. ఈసారి మాత్రం ఏకంగా రూ.174 కోట్లు రానుండడం విశేషం. మూడేళ్లుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో ఈ నిధులు జిల్లాకు చేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, 2001 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 ప్రకారం నిధులు కేటాయించడంతో ఇంతపెద్దమొత్తం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
 
25లోగా ప్రతిపాదనలు
13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు రూపొందించే పనిలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు. రూ.174 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 25లోగా అందించి ప్రభుత్వానికి చేరవేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీల ప్రతిపాదనలు గ్రామసభలో, మండల పరిషత్ ప్రతిపాదనలు సమావేశంలో ఆమోదించి జెడ్పీకి, చివరగా మొత్తం నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తారు.
 
ఒక్కో జెడ్పీటీసీకి రూ.40 లక్షలు?
13వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధులకు సమానంగా వాటాలు పంచినట్లు సమాచారం. జెడ్పీకి రూ.34.94 కోట్లు కేటాయించగా.. ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి సుమారు రూ.30 నుంచి రూ.40 లక్షల పనులు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల బీఆర్‌జీఎఫ్‌లో తక్కువ స్థాయిలో నిధులు రావడంతో కినుక వహించిన జెడ్పీటీసీలు 13వ ఆర్థిక సంఘం నిధులు భారీగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement