ఆసరా పెన్షన్లలో రూ.50 కోత!
‘కనీస’చార్జీల పేరుతో కత్తిరించనున్న బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు చార్జీల భారం నిరుపేదల పెన్షన్లకు సైతం ఎసరు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్ల కు వచ్చే నెల నుంచి రూ.50 కోత పడుతోంది. చార్జీలు వసూలు చేస్తామని, పెన్షన్‌లో రూ.50 తగ్గిస్తామని బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇప్పటి నుంచే సమాచారం అందిస్తున్నారు. దీంతో ఆగస్టు నెల పెన్షన్లకు కోత తప్పదని లబ్ధిదారు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తం గా 35.30 లక్షల మంది పెన్షన్‌దారులున్నారు. వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులు, హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తోంది. వికలాంగులకు రూ.1,500 పెన్షన్ అందిస్తోంది. ఆపన్నులు, ఆసరా లేని వారికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెల మొదటి వారంలో ఈ డబ్బులు చెల్లిస్తోంది.
ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో..
ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లోని సేవింగ్ ఖాతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలో రూ.వెయ్యి కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే రూ.31 నుంచి రూ.37 వరకు చార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ ఖాతాలన్నీ సేవింగ్స్ ఖాతాలుగానే ఉన్నాయి. వీటిలో కొందరు రూ.500తో ఖాతాలు తెరవగా.. మరికొందరు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచారు.
నోట్ల రద్దు అనంతరం మారిన నిబంధనలతో సేవింగ్స్ ఖాతాల్లోనూ కనీస మొత్తం నిల్వ ఉండాలని, లేకుంటే చార్జీలు విధించాలని బ్యాంకులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి వరుసగా చార్జీలకు సంబంధించిన సర్క్యులర్లు కూడా జారీ అయ్యాయి. ఏ బ్యాంకులు ఎంత చార్జీలు విధిస్తాయనే గందరగోళం కూడా ఇంకా కొనసాగుతోంది. దీంతో కనీస బ్యాలెన్స్ పేరిట చార్జీలు వడ్డిస్తే ఆసరా పెన్షన్లకు కోత పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే తక్కువ మొత్తం ఉండే నిరుపేదల ఆసరా పెన్షన్ల ఖాతాలకు కూడా చార్జీలు వసూలు చేస్తారా.. లేదా అనే విషయంలో బ్యాంకు అధికారులకూ స్పష్టత లేదు.
మీకు రూ.950 వస్తుంది..
మరోవైపు కొన్ని బ్యాంకులు ‘వచ్చే నెల నుంచి మీ పెన్షన్‌లో రూ.50 చార్జీ కింద కట్ అవుతుంది. మీకు రూ.950 వస్తుంది..’ అని ఇప్పటి నుంచే లబ్ధిదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఆసరా పెన్షన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహించే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాత్రం పెన్షన్ ఖాతాలకు చార్జీలు వసూలు చేసే విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.
చార్జీలపై తమకు సమాచారం అందించాలని ఇప్పటికే పలు జిల్లాల్లో డీఆర్‌డీఏ అధికారులు బ్యాంకర్ల వివరణ కోరినట్లు తెలిసింది. ఇక వచ్చే కాస్తోకూస్తో ఆర్థిక సాయంలో కత్తెర వేయటం సరికాదని కొందరు లబ్ధిదారులు బ్యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు. ఎందుకు చార్జీలు వసూలు చేస్తారనేది తెలియక గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ మొత్తం ఉండే ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా, లేదా అనేది ఈనెల గడిస్తేనే తెలుస్తుంది.