మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. అధికారులు వారికి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని లక్షలాది మంది కూలీలు తమ శ్రమ ఫలం కోసం ఎదురు చూస్తున్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన కూలీలకు యంత్రాంగం డబ్బులు చెల్లించలేదు. జిల్లాలో 31,619 శ్రమశక్తి సంఘాలు ఉండగా, 5,80,577 మంది కూలీలు ఉన్నారు. రెగ్యులర్‌గా పనిచేస్తున్న 3,92,598 మంది కూలీలకు రూ.13.30 కోట్లు బకాయిలు ఉన్నారు. ఫలితంగా కూలీలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
సాకులతో కాలం వెళ్లదీత
ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసే కూలీలకు ప్రతీ వారం కూలీ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ ఆలస్యమైన గరిష్టంగా 14 రోజుల్లో వేతనాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ జిల్లాలో పనిచేస్తున్న కూలీలకు నెలలు గడుస్తున్నా వేతనాలు అందడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలు, కొత్త బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల నిధులు రావడం ఆలస్యమైందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) అధికారులు చెబుతున్నా, వచ్చిన నిధులు బయోమెట్రిక్ విధానం ద్వారా అందించడంలో తాత్సారం చేస్తున్నారు.
కూలీల వేతనాల చెల్లింపులు జిల్లాలోని 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంకు, 34 మండలాల్లో పోస్టాఫీసు ద్వారా చేపడుతున్నారు. తాము నిధులు విడుదల చేసినా, యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు వారు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారని, దీని వల్ల తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని, చెల్లింపులు విషయమై తమకు సంబంధం లేదన్న సాకుతో డ్వామా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
బయోమెట్రిక్ కష్టాలు
ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు అందించే వేతనాల ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా సాగుతుంది. వేతనాల పంపిణీలో అక్రమాలను అరికట్టాలని, వేతనాలు నేరుగా కూలీలకే అందేలా బయోమెట్రిక్ ద్వారా వేతనాలను అందించేందుకు యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇందుకోసం గ్రామపంచాయతీల్లో సీఎస్పీలను నియమించి కూలీల నుంచి వేలిముద్రలు సేకరించారు.
సామాజిక పింఛన్లను వీరే బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పటికే కూలీలు, పింఛన్‌దారుల వేలి ముద్రలు సేకరించి, వారికి బ్యాంకు ఖాతాలు తెరిచారు. డబ్బులు పంపిణీ చేసే సమయంలో వేలి ముద్రలు తీసుకోవాల్సి ఉండడంతో, వేలి ముద్రలు సరిగా పడడం లేదని వేతనాలు సీఎస్పీలు అందించడం లేదు. మరికొందరు కూలీల బ్యాంకు ఖాతాలు లేవని, కూలీలు జాబ్‌కార్డులను గ్రామంలో పిలిచే పేర్లతోనే తీసుకోవడం, ఆధార్ కార్డులోని పేర్లు, కూలీల జాబ్ కార్డుల్లోని పేర్లలో తేడాలు ఉండడం వల్ల వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా ఉందన్న కారణాలతో కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు.
పింఛన్ల పంపిణీ కూడా వీరే చేపట్టడంతో, గ్రామాల్లోని కూలీలకు వేతనాలు ఇవ్వకుండా పింఛన్లను మాత్రమే పంపిణీ చేస్తున్నారని, అడిగితే తాము బ్యాంకు నుంచి కొద్ది మొత్తంలోనే డబ్బులు డ్రా చేశామని సీఎస్పీలు సమాధానం చెబుతున్నట్లు కూలీలు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలు అరికట్టడం ఏమోగాని, కూలీలకు వేతనాలు అందక అప్పుల పాలవుతున్నారు.
నిధులున్నా అందని వేతనాలు
జిల్లాలోని కూలీలకు వేతనాలు అందించేందుకు యాక్సిస్ బ్యాంకుకు రూ.6.80 కోట్లు, పోస్టాఫీసుకు రూ.4 కోట్లు, 2013-14 పెండింగ్ వేతనాలు యాక్సి స్ బ్యాంకుకు రూ.2.45 కోట్లను ఆయా సంస్థలకు ఈ నెల మొదటి తేదీనే చెల్లించారు. కానీ, ఇప్పటి వరకు ఆయా సంస్థలు కూలీలకు వేతనాలు అందించడం తాత్సారం చేస్తున్నాయి. దీంతో మంగళవారం డ్వామా అధికారులు యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించినా వేతనాలను మాత్రం వీరు కూలీలకు అందించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పక్షం రోజుల్లో చెల్లింపులు - గణేష్ జాదవ్, డ్వామా పీడీ
ఎన్నికలు, నూతన బడ్జెట్‌ల కేటాయింపు వల్ల నిధుల విడుదల కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం కూలీలకు చెల్లించే రూ.13.30 కోట్ల బకాయిలను యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసులకు గత వారమే అందించాం. కానీ, ఇప్పటి వరకు వారు చెల్లింపులు చేపట్టలేదు. 15 రోజుల్లోగా కూలీలందరికి వేతనాలు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించాం. వేతనాలు ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించాం. కూలీలందరికి వేతనాలు అందుతాయి.
నెలలుగా ‘ఉపాధి’ కూలీలకు అందని వేతనాలు
Published Fri, Aug 8 2014 3:39 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement