
సాక్షి, ఖమ్మం: ‘ఆయనను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసి బయటికి వెళ్లారు. అంతే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలియదు. ఆయన నాకు మళ్లీ కావాలి. మాలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఏనాడు ఇంట్లో నుంచి బయటికి రానిదాన్ని ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంతో పాటు 48 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీళ్లతో విఙ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖమ్మంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తొంబై శాతం గాయాలతో ఆస్పత్రి పాలైన ఆయన మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక 28 ఏళ్లుగా ఆర్టీసీలో సేవలు అందించిన శ్రీనివాసరెడ్డి రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసీఆర్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత)
తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు..
‘నేను అందరికీ ముఖ్యంగా ఆర్టీసీ వాళ్లకు చెబుతున్నది ఒకటే. ప్లీజ్.. దయచేసి ఇంకెవరూ ఇలాంటి పనిచేయొద్దు. మాలాగా పిచ్చోళ్లు, అనాథలు అయిపోతారు. ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు లేకుంటే కుటుంబాలు నాశనమైపోతాయి. జరిగేదేదో జరుగుతుంది. న్యాయం చేకూరుతుంది. మా తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు. వాడింకా షాక్‌లోనే ఉన్నాడు. తన మఖం కూడా కాలిపోయింది’ అంటూ శ్రీనివాసరెడ్డి పెద్ద కొడుకు ఆర్టీసీ కార్మికులకు విఙ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment