నల్లగొండ టుటౌన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ప్రభావం ఏడో రోజుకు కూడా ఏ మాత్రం తగ్గలేదు. మంగళవారం జిల్లాలోని అన్ని బస్సు డిపోల ఎదుట కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనలు మిన్నంటాయి. అర్ధనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పులు, దున్నపోతుకు వినతిపత్రాలు, వివిధ శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేస్తూ కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో వివిధ పట్టణాలకు, పల్లెలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం పూట కొన్ని బస్సులు డిపోల నుంచి బయటికి తీయించి నడపడానికి ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని పక్కకు తప్పించారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆయా డిపోల పరిధిలోని ప్రధాన పట్టణాలకు జిల్లా నుంచి 263 బస్సులను నడిపించారు. వీటిలో 72 ఆర్టీసీ బస్సులు కాగా 191 అద్దె బస్సులున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్లలో వేచి ఉన్నా అవి రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
ఆర్టీసీ సమ్మెకు ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహన దారులు నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు రూ. 150 నుంచి రూ. 200 వరకు వసూలు చేస్తున్నారు. ఆటోలు సైతం గతంలో తీసుకున్న చార్జీలకన్నా అదనంగానే ప్రయాణికుల నుంచి తీసుకుంటున్నారు. నల్లగొండ డిపో ఎదుట కార్మిక సంఘాల నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. వంటా వార్పు చేసి బస్టాండ్ ఆవరణలో సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ శాసనసభా పక్షనేత రమావత్ రవీంద్రనాయక్, ఇతర నాయకులు కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కోదాడలో ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి డిపో గేట్ ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి రంగా థియేటర్ వరకు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి మానవహారం ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు ఐదు బస్సులను నడిపారు. ఖమ్మం, మిర్యాలగూడ, హైదరాబాద్‌ల నుంచి బస్సులు బస్టాండ్ బయట వరకు వచ్చి ప్రయాణికులను తీసుకొని వెళుతున్నాయి. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగింది. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు ఎస్కార్ట్‌తో నాలుగు బస్సులు బయటకు తీసి నడిపించారు. సూర్యాపేటలో డిపో గేట్ వద్ద ధర్నాతో పాటు ర్యాలీ నిర్వహించారు.
నార్కట్‌పల్లి డిపోలో నుంచి బస్సులు బయటి రాకుండా కార్మికులు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు. డిపో మేనేజర్ మినహా డిపోలో వివిధ శాఖలలో పని చేస్తున్న సూపర్‌వైజర్లు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైవేపై ధర్నా నిర్వహించారు. మునుగోడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా భువనగిరి బస్ డిపో ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిపో ఎదుట కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవరకొండ, యాదగిరిగుట్ట బస్ డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బస్సుల డిపోల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
తగ్గని నిరసనల జోరు
Published Wed, May 13 2015 12:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement