
‘రుణమాఫీ' విడుదల
రుణమాఫీ విడుదలతొలివిడతగా రూ.414.25 కోట్లు
కరీంనగర్ : రుణమాఫీపై ప్రభుత్వం తొలి అడుగువేసి అన్నదాతల ఆశలకు ఊపిరిపోసింది. మాఫీ కోసం కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్న రైతులకు ప్రభుత్వం తొలివిడతగా 25 శాతం నిధులను శనివారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,73,876 మంది రైతులకు 31 బ్యాంకుల్లో కలిపి రూ.1,656 కోట్లు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. మొదటి దఫాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,250 కోట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న సంతకం చేశారు. ఇందులోంచి మన జిల్లాకు రూ.414.25 కోట్లు రాగా, వాటిని 116 జీవో ప్రకారం శనివారం విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగతా మొత్తం రుణం ఎప్పుడు మాఫీ అవుతుందోననే ఉత్కంఠ రైతుల్లో నెలకొంది.