‘షాదీముబారక్’ అక్రమాలకు కేరాఫ్
► గతంలో పెళ్లయిన వారి పేరుతో కూడా..
► బోగస్ పత్రాలతో ఆర్థిక సహాయం స్వాహా
► పథకం అమలులో దళారుల దందా
► పక్కదారి పడుతున్న నిరుపేదలపథకం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిరుపేద మైనార్టీ కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీముబారక్ పథకం పక్కదారి పడుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న నూతన వధువులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారు. పెళ్లి జరిగి ఏళ్లు గడిచినా వారి పేర్లను, ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న వారిని లబ్ధిదారులుగా చూపి ఈ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని కలిసి పంచుకుంటున్నారు. ఈ పథకం మంజూరు చేయించేందుకు కొందరు నేతలు దళారుల అవతారమెత్తారు. దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
ముఖ్యంగా మారుమూల మండలాల్లో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. షాదీముబారక్ పథకం కింద నూతనంగా పెళ్లి చేసుకున్న వధువులకు ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. నేరుగా ఆ వధువు బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ పథకం ఇప్పుడు దళారులకు వరంగా మారింది. ఈ దందాకు కొందరు అధికారులు కూడా సహకరించడంతో అక్రమాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పంచుకుంటున్నారు..
ఈ దందాలో ఆరితేరిన దళారులు లబ్ధిదారులతో ముందే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సహాయంలో సగం చెల్లిస్తే చాలు అన్నీ వారే చూసుకుంటున్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలను తయారు చేయడంతోపాటు, వారి పేరుతో బ్యాంకు ఖాతాను కూడా తెరుస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందాలంటే మొదట గ్రామ వీఆర్వో ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పెళ్లి కార్డు, సంతకాలు చేయించిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపై ఆర్‌ఐ, తహసీల్దార్లు విచారణ చేపట్టి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖకు ఆన్‌లైన్‌లో పంపుతారు.
ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకొని లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 3,449 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 3,209 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వీటిలో 2,966 లబ్ధిదారులకు రూ.51 వేల చొప్పున సుమారు రూ.15.12 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా 240 దరఖాస్తులు రెవెన్యూ అధికారుల విచారణలో ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం..
షాదీముబారక్ పథకంలో అక్రమాలు మా దృష్టికి రాలేదు. అలాంటివేమైనా ఉంటే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇటీవలే బదిలీపై జిల్లాకు వచ్చాను. - కేశవరావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి