భద్రతే ధ్యేయం: సీవీ ఆనంద్
- ముగిసిన సైబరాబాద్ పోలీసులకు శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల బాధ్యత అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆ దిశగా అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో బుధ, గురువారాల్లో అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు కాపాడటం, నేరాలను అదుపు చేయడం, ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు వైపరీత్యాలప్పుడు సేవలు అందించడంలో సైబరాబాద్ పోలీసు ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంపొందించడానికి సిబ్బందికి నిరంతరం పునఃశ్చరణ, అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, క్రైమ్ ఇన్‌ఛార్జీ డీసీపీ జానకీషర్మిల, సీటీసీ ఏసీపీలు శ్రీనివాస్, గాంధానారాయణతో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఈకింది అంశాలపై అవగాహన కల్పించారు
సెంట్రల్ కంప్లయింట్ సెల్ గురించి
క్రైమ్, లా అండ్ ఆర్డర్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సిటీ క్రైమ్ రికార్డు బ్యూరో, క్లూస్ టీమ్ ఒకదానికొకటి అనుసంధానమై పని చేస్తున్న పద్ధతి
స్పెషల్ బ్రాంచ్, పాస్‌పోర్టు ఫారిన్ సెక్షన్ యొక్క విధులు, పనిచేసే విధానం
ఐటీ సెల్ పని తీరు, కంట్రోల్ రూమ్‌లోని విధులు
భూతగాదాల విచారణ, పరిశోధన, పరిష్కారం కోసం తయారు చేసిన ఎస్‌ఓపీ విధానం
సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్...
ఎన్నో రకాల ఒత్తిళ్లకు గురవుతున్న పోలీసులు తమను తాను అర్థం చేసుకోవడానికి, తోటి ఉద్యోగులతో వ్యవహరించేందుకు నిరంతరం ప్రజాసంబంధాలు కొనసాగించడం
ప్రజలతో నిరంతరం స్నేహాభావంగా ఉండటం
ప్రతి పోలీసు వ్యక్తిగతంగా మంచిగా నడుచుకోవడం
సైబరాబాద్‌ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం
ప్రజల అవసరాలకు అనుగణంగా సహాయం, సేవలందించడం. పోలీసు సేవలో ప్రజలను భాగస్వాములను చేయడం