
అద్దె గర్భంతో అడ్డగోలు దందా
- నగర నడిబొడ్డున యథేచ్ఛగా సరోగసీ వ్యాపారం ∙సాయికిరణ్ ఇన్‌ఫెర్టిలిటీ - హాస్పిటల్‌లో దారుణం
- పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఉచ్చులోకి దించుతున్న వైనం
- ఏకంగా 48 మంది మహిళలకు అద్దె గర్భాలు
- రాష్ట్రంతోపాటు ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్, నేపాల్ నుంచి మహిళల తరలింపు
- ఇప్పటిదాకా 400 మందితో అద్దె గర్భాలు
- ఆసుపత్రికి నోటీసులిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: నిరుపేద మహిళలే వారి టార్గెట్.. ఆ మహిళల గర్భాలే వారికి కాసులు రాల్చే యంత్రాలు.. డబ్బు ఆశ చూపి అద్దె గర్భానికి ఒప్పించడం.. బిడ్డ పుట్టాక ఎంతో కొంత ముట్టజెప్పి వదిలేయడం ఆ ఆసుపత్రుల స్టయిల్! ఇలా అమాయకుల పేదరికాన్ని ఆసరా చేసుకొని అద్దె గర్భం పేరిట కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్న ఓ ఆసుపత్రి బాగోతం బట్టబయలైంది. రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఆసుపత్రి ‘సరోగసీ’ దందాను కొనసాగిస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అద్దె గర్భాల వ్యాపారాన్ని పోలీసులు, వైద్యాధికారులు శనివారం రట్టు చేశారు. ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్‌తోపాటు నేపాల్‌కు చెందిన 48 మంది అద్దె గర్భం మోస్తున్న మహిళలను గుర్తించారు. పిల్లల్లేని దంపతులు, కొందరు ధనవంతుల అవసరాలను ఆదాయంగా మల్చుకునేందుకు నగరంలో అడ్డగోలుగా సాగుతున్న సరోగసీ వ్యాపారానికి ఈ ఆసుపత్రి ఉదంతం పరాకాష్టగా నిలిచింది.
దేశమంతా నెట్‌వర్క్
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని సాయికిరణ్ ఇన్‌ఫెర్టిలిటీ హాస్పిటల్ సరోగసీ పేరుతో ఈ దందా నడుపుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మజ, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ఆసుపత్రిలో జరిపిన తనిఖీల్లో అనేక విస్మయకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అద్దె గర్భాలు మోసేవారి కోసం సాయికిరణ్ ఆసుపత్రి రాష్ట్రంలోనే కాదు దేశమంతటా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు. హాస్పిటల్‌లో అద్దె గర్భం మోస్తూ కనిపించిన 48 మంది మహిళల్లో హైదరాబాద్‌కు చెందినవాళ్లు 16 మంది ఉండగా.. మిగతా వారిని దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలించారు.
ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్, నేపాల్‌లోని పలు ప్రాంతాలకు చెందిన పేద మహిళలను గుర్తించి, కొంతకాలం హైదరాబాద్‌లో ఉంటే లక్షలిస్తామని ఆశ చూపారు. ఇలా వారందరినీ ఆసుపత్రికి రప్పించి వారి గర్భాశయాల్లో పిండాలను ఉంచారు. ఇందుకు ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిల్లలు అవసరమైన దంపతుల నుంచి భారీ మొత్తంలో బేరం మాట్లాడుకొని అందులో నామమాత్రంగా కొంత మొత్తం ఈ మహిళలకు చెల్లిస్తున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం కూడా డబ్బులు ఇవ్వలేదని అద్దె గర్భం మోస్తున్న కొందరు మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించడం గమనార్హం.
ఇప్పటిదాకా 400 మంది..
సాయికిరణ్ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఏకంగా 400 మంది మహిళలను సరోగసీ ఉచ్చులోకి దించారు. ఈ మేరకు అధికారులు ఆ మహిళల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి రికార్డులు, మహిళల చికిత్సకు సంబంధించిన కేస్‌షీట్లు, వారికి వాడిన మందులు తదితర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలను నిర్బంధంగా ఆసుపత్రికి తరలించి ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి ఈ దందా నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు.
ఎలాంటి అనుమతులు లేవు
సాయికిరణ్ ఆసుపత్రి ఎలాంటి అనుమతులు లేకుండానే సరోగసీ పేరిట దారుణమైన అక్రమాలకు పాల్పడుతోంది. ఇది మహిళలను నిర్బంధించడమే. సరోగసీ కోసం ఈ ఆసుపత్రికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కేవలం స్కానింగ్ చేయడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఆసుపత్రిలో గుర్తించిన మహిళల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అధికారుల ఆదేశాల మేరకు వారిని ఎక్కడ ఉంచాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ పద్మజ, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి
మేం తెలియక వచ్చాం...
ఆసుపత్రిలో ఇంతకాలం ఉండాల్సి వస్తుందని తమకు తెలియదని అద్దెగర్భం మోస్తున్న కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తాము తెలియకుండానే వచ్చి మోసపోయామన్నారు. డబ్బులు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, విడతల వారీగా ఇస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మాత్రం తమకు తెలిసే అద్దె గర్భం మోసేందుకు వచ్చామని చెప్పారు.