మా అమ్మ కిరీటమ్మ... | Sakshi Interview With ZP Chairman Sudeer Kumar | Sakshi
Sakshi News home page

మా అమ్మ కిరీటమ్మ...

Published Sun, Jun 30 2019 11:45 AM | Last Updated on Sun, Jun 30 2019 11:47 AM

Sakshi Interview With ZP Chairman Sudeer Kumar

సుధీర్‌కుమార్‌– శోభారాణి దంపతులు

‘వృత్తిరీత్యా నేను వైద్యుడిని.. ప్రవృత్తి రాజకీయం అయింది... ఆదాయం వచ్చే పోస్టును వదులుకుని ప్రజలకు సేవ చేసే ఉద్యోగం ఎంచుకున్న నా తండ్రి జాన్‌ గొప్పతనం, నర్సింగ్‌ వృత్తి ద్వారా ప్రజలకు వైద్యం అందించిన మా అమ్మ కిరీటమ్మ స్ఫూర్తి.. ఈ రెండూ కలిపి సేవ చేసే అవకాశం ఉన్న వైద్యవృత్తి వైపు నన్ను మళ్లించాయి.. ఇక వైద్యవృత్తిలో పేరు సంపాదించుకున్నాక పరిస్థితులు రాజకీయాల వైపు అడుగులు వేయించాయి... అంతేకాకుండా సహచరిణిగా డాక్టర్‌నే ఎంచుకోవడంతో పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలన్న నా కల సాకారమైంది.’ అంటూ ‘సాక్షి పర్సనల్‌ టైం’లో చెప్పుకొచ్చారు వరంగల్‌ అర్బన్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌. నేడు ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ నుంచి లీడర్‌గా ఎదిగిన చైర్మన్‌ సుధీర్‌కుమార్‌తో పాటు ఆయన సతీమణి శోభారాణి దంపతులను పలకరించగా వైద్యం, రాజకీయాలతో పాటు కుటుంబానికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.

సాక్షి, వరంగల్‌: సర్కారు బడిలోనే చదువుకున్నా... కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ మాది. వృత్తిరీత్యా అమ్మనాన్నలు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ స్థిరపడ్డారు. నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అంతా ముల్కనూర్‌లోనే చదువుకున్నం. ముల్కనూర్‌ సర్కారు బడిలో చదుకున్న నేను ఇంటర్మీడియట్‌ హన్మకొండలో పూర్తి చేసినా. ఉస్మానియాలో డిగ్రీలో చేరిన ద్వితీయ సంవత్సరమే బీఏఎంఎస్‌లో సీటు రావడంలో జాయిన్‌ అయ్యా. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో ఎండీ పూర్తి చేశా.

సిర్రగోనే ఆడేది, చేపలు పట్టేది
చిన్నప్పుడు స్నేహితులతో కలిసి బడి చుట్టీ అయితే చాలు ఆటలకు వెళ్లేవాళ్లం. కోతికొమ్మ మొదలు సిర్రగోనే, గోటీలాట.. ఇలా అన్ని ఆటలు ఆడేది. వేసవి సెలవులు వచ్చాయంటే బావులు, చెరువుల్లో ఈత కొట్టేవాళ్లం. గాలాలతో చేపలు పట్టేవాళ్లం. ఇంటర్‌ స్థాయికి వచ్చే సరికి టేబుల్‌ టెన్నిస్, బాల్‌ బ్యాడ్మింటన్, వాలీబాల్‌ ఆటలు అడేది. 2006లో వేములవాడలో జిల్లా పరిషత్‌ ఆధ్వర్యాన వాలీబాల్‌ టోర్నమెంట్‌ పెడితే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి జట్టుపై నేను కెప్టెన్‌గా ఉన్న మా జట్టు విజయం సాధించింది. 

ఎన్‌టీఆర్, కమల్, శోభన్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసేది
ప్రత్యేకంగా ఫలానా హీరో, నచ్చిన హీరో అంటూ ఏమీ ఉండకపోయేది. ఎవరి సినిమాలు వచ్చినా చూసేది. ఇప్పటికీ చూస్తున్నాము.  ఎక్కువగా ఎన్‌టీఆర్‌ సినిమాలు థియేటర్లకు రాగానే వెళ్లి చూసేది. అలాగే సాంఘిక, ఫ్యామిలీ సినిమాలైతే కమల్‌హాసన్, శోభన్‌బాబు నటించిన సినిమాలు కూడా ఎక్కువగా, తప్పకుండా చూసేవాన్ని. ఇప్పటికీ ఫ్యామిలీతో తరచూ సినిమాలు చూస్తుంటా.

పెద్దలు కుదిర్చిన పెళ్లే...
అమ్మనాన్నలు విద్యావంతులు, ఉద్యోగులు. వారి ఇష్టం మేరకు మా చదువులు, పెళ్లిళ్లు జరిగాయి. నేను ప్రేమ జోలికి వెళ్లలేదు. ఎంబీబీఎస్‌ హౌస్‌సర్జన్‌ చేస్తున్న సమయంలో శోభారాణితో నా పెళ్లి కుదిరింది. దూరపు బంధువు కూడా కావడంతో ఇరుపక్షాల పెద్దలు మాట్లాడి 1992లో మా పెళ్లి చేశారు. చదువులు పూర్తయ్యాక 1995లో ఇద్దరం కలిసి ముల్కనూర్‌లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాము. పిల్లల విషయానికొస్తే పాప సుకీర్తి ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అబ్బాయి సుకుమార్‌ పూర్తయింది.

అమ్మనాన్నలే మాకు స్ఫూర్తి
మా నాన్న మారెపెల్లి జాన్, అమ్మ కిరీటమ్మ. నాన్నకు అప్పట్లో ఒకేసారి రెండు ఉద్యోగాలు ఒకేసారి వచ్చాయి. ఒకటేమో రెవెన్యూ శాఖలో గిర్దావర్, మరొకటి ఇప్పుడు మనం వీడీఓ(విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) అంటున్నాం.. అప్పుట్లో వీఎల్‌డబ్ల్యూఓ అనేది. ఈ రెండింట్లో మొదటి ఉద్యోగంలో చేరితే ఆదాయం బాగా వస్తుందని తెలిసినా ప్రజలకు సేవ చేసే అవకాశమున్న వీడీఓ పోస్టులోనే నాన్న చేరారు. ఇక అమ్మ కిరీటమ్మ నర్సింగ్‌ వృత్తిలో ప్రజలకు వైద్య సేవలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. నాకు కూడా కిరీటమ్మ కొడుకుగానే బాగా గుర్తింపు వచ్చింది. వారి సేవాభావమే మాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 

మా ఆవిడ ఉత్తమ వైద్యురాలు, ఉత్తమ గృహిణి
నేను ఫుల్‌టైం రాజకీయాల్లోకి రావడంతో వైద్య వృత్తి నుంచి తప్పుకున్నట్లే.  మా ఆవిడ శోభ మాత్రం వైద్యురాలిగానే కొనసాగుతున్నారు. ఆమె ఉత్తమ వైద్యురాలు.. అంతకుమించి ఉత్తమ గృహిణి కూడా. వంగర మెడికల్‌ ఆఫీసర్‌గా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమెకు స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రాం కింద రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌లోనూ కాయకల్ప ఆవార్డు దక్కింది. ఆమె ఎల్కతుర్తి మెడికల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ అయ్యా.

ఇప్పుడు ఆమె ఇదే మండలం గోపాల్‌పూర్‌లో పని చేస్తుండగా ఎల్కతుర్తి జెడ్పీటీసీగా.. వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడు ఇంటికి వెళ్లే వాళ్లమో తెలిసేది కాదు. అలాంటప్పుడు శోభారాణి అన్నీ తానై కుటుంబాన్ని చూసుకుంది. ఇక నాకు 2006లోనే చిగురుమామిడి జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చినా ఆసక్తి చూపలేదు. అప్పుడు పోటీకి దిగితే గెలిచి జెడ్పీ చైర్మన్‌ అయ్యేవాడిని. అయితే, ఇప్పుడు ఆ అవకాశం దక్కింది.

చేపలు, బీరకాయ ఇష్టం
ఫుడ్‌ విషయంలో నిబంధనలు ఏమీ లేవు. నాన్‌ వెజ్‌లో చికెన్, మటన్, చేపలతో పాటు వెజిటేరియన్‌ కూడా ఇష్టంగానే తింటాను. నాన్‌వెజ్‌లో అయితే చేపలు ఇష్టం. వెజిటేరియన్‌లో చాలా మంది బీరకాయ తినరు... కానీ నేను ఇష్టంగా తింటా. వైద్యం, రాజకీయాల్లో బిజీ కావడంతో పుస్తకాలు చదివే సమయం దొరకలేదు. ఎలెక్స్‌ హేలీ రాసిన రూట్స్‌(ఏడు తరాలు) నాకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి.

ఇందిర, పీవీ, కేసీఆర్‌ నచ్చిన నేతలు
నచ్చిన రాజకీయ నాయకులంటే... ఇందిరాగాంధీ, పీవీ.నర్సింహారావు, కేసీఆర్‌. ప్రజాసంక్షేమం, పరిపాలన విషయంలో వీరికి ఎవరూ సాటిలేరు. తెలంగాణ గడ్డ వంగరలో పుట్టిన పీవీ నర్సింహరావు అనేక సంస్కరణలు చేపట్టారు. ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన ద్వారా కేసీఆర్‌ చరిత్రకెక్కిన నాయకుడు. ఆసరా, రైతుబంధు, బీమా పథకాలు సాహసోపేతంగా అమలు చేస్తున్న నేత ఆయన. కేసీఆర్‌ నాకు నచ్చిన నాయకుడు. రాజకీయాల్లో మచ్చ లేని నేతగా ఎదిగిన ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఆశీస్సులతో నాకు పదవులు వచ్చాయి.

రూ.10కే వైద్యం 
ముల్కనూర్‌లో ప్రాక్టీస్‌ పెట్టాక మంచి గుర్తింపు వచ్చింది. గ్రామీణ ప్రాంతం కావడంతో అందరూ పేదలే వచ్చేవాళ్లు. నేనైనా, నా భార్య శోభారాణైనా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇతరులు రూ.200 తీసుకుంటే అతి తక్కువగా రూ.10కు వైద్య పరీక్షలు చేశాము. గర్భసంచి తొలగింపు వ్యాపారంగా మారినప్పటికీ... మా 27 ఏళ్ల వైద్యవృత్తిలో ఏనాడూ గర్భసంచి అపరేషన్లు చేసింది లేదు. అత్యవసర పరిస్థితుల్లో తప్పని సరైతే ఇన్నేళ్లలో మొత్తంగా ఓ పది ఆపరేషన్లు చేసి ఉంటాం కావొచ్చు. అందుకే ప్రజలకు దగ్గరయ్యాము.

సంతోషంగా ఉంది
మా సార్‌ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం నాకు సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్‌ పార్టీ, ఉద్యమ సమయంలో చాలా కష్టపడ్డారు. అయితే, ఏ రోజు కూడా పదవి కోసం చూడకుండా పనిచేసుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు ఆయనకు పదవి రావడంపై మాకు హ్యపీగా ఉంది. ఆయన జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినందుకు గొప్ప గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఈ ఇంటి కోడలిగా వచ్చినందుకు కలిగిన సంతోషం అంతాఇంతా కాదు. రాజకీయంగా ఎక్కడికి వెళ్లినా, ఏ సమయంలో వచ్చినా ఇంట్లోకి చేరగానే అవన్నీ మరచిపోయి చికాకు లేకుండా నాతో పాటు పిల్లలతో గడుపుతారు.  
– డాక్టర్‌ శోభారాణి, సుధీర్‌కుమార్‌ సతీమణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement