నీళ్లొస్తే పండుగే! | Sakshi Road Show in Karimnagar For Lok Sabha Election | Sakshi
Sakshi News home page

నీళ్లొస్తే పండుగే!

Published Mon, Apr 8 2019 10:03 AM | Last Updated on Mon, Apr 8 2019 10:03 AM

Sakshi Road Show in Karimnagar For Lok Sabha Election

రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు పథకాలు బాగున్నాయంటూ రైతన్న మురిశాడు.. బతుకమ్మ చీరల తయారీతో పాటు ఏడాదంతా పని దొరికే వెసులుబాటుతో బతుకు మీద బెంగ పోయిందంటూ నేతన్న నవ్వాడు.. మొత్తానికి కాళేశ్వరం నీళ్లొస్తే పండుగేనంటూ జనం ఎలుగెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, బీమాతో పాటు పెట్టుబడి సాయంతో రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందని అన్నదాతలు సంబరపడ్డారు. ఆసరా పింఛన్లు బాగున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నోళ్లకు కాకుండా.. అర్హులకు అందించాలని మహిళలు కోరారు. వీధి వ్యాపారులను ఆదుకోవాలని, ఆర్థికంగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని పలువురు చిన్న వ్యాపారులు కోరారు. కౌలు రైతులను ఆదుకోవాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. బోయినపల్లి వినోద్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌), సంజయ్‌కుమార్‌ (బీజేపీ) హోరాహోరీ తలపడుతున్న కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రధాన రహదారులపై ‘సాక్షి’ నిర్వహించిన రోడ్‌ షోలో సామాన్యులు ఏయే అంశాలపై ఎలా స్పందించారంటే..-సాక్షి, నెట్‌వర్క్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర రహదారుల (స్టేట్‌ హైవేస్‌) వెంట ‘సాక్షి’ బృందం లోక్‌సభ ఎన్నికల వేళ జనం నాడిని పట్టే ప్రయత్నం చేసింది. కరీంనగర్‌ – కామారెడ్డి రహదారి, సిరిసిల్ల – సిద్దిపేట రహదారి, వేములవాడ – కోరుట్ల రహదారులపై మొత్తం 105 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగింది. ఏ రాజకీయ పార్టీకీ కొమ్ము కాయని మనుషుల కల్మషం లేని మాటల్లో ఎన్నో వాస్తవాలు.. ‘మా బీడు భూములకు కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు రావాలి.. గంగ వస్తే బెంగ తీరుతుంది. మా పంటలు పండుతాయి’ అని మట్టి మనుషులు తమ మనసులోని మాటను చెప్పారు. ఏ పార్టీకి మద్దతునిస్తారు? ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? పుల్వామా దాడులపై మీ స్పందన ఏమిటి? తదితర ప్రశ్నలకు పలువురు తమదైన శైలిలో బదులిచ్చారు. కాగా, పలుచోట్ల పచ్చని పొలాలు.. ఇంకొన్ని చోట్ల నీరు లేక ఎండిపోతున్న పంటలు కనిపించాయి. మొత్తానికి అందరి నోటా కాళేశ్వరం ప్రాజెక్టు మాటే వినిపించింది.

ఎగువ మానేరు నిండాల.. కష్టాలు తీరాల
కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో సగం ఊళ్లను సస్యశ్యామలం చేసే గంభీరావుపేట ఎగువ మానేరు జలాశయం నీరు లేక ఎండిపోతోంది. ఆ ప్రాజెక్టులో నీరుంటే.. వాగు పారుతుంది. మానేరు వాగు పారితే.. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో నీటి ఊటలు ఉంటాయి. ఈ జలాశయంలోకి గోదావరి జలాలను మళ్లించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 కింద పనులు సాగుతున్నాయి. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ పనులు పూర్తయితే.. నీటిని నిమ్మపల్లి మూల వాగులోకి మళ్లిస్తారు. గోదావరి జలాలు మళ్లించాలని సిరిసిల్ల మెట్ట ప్రాంత రైతాంగం ‘రోడ్డు షో’లో వేడుకుంది.

ఉద్యోగాలు.. ఉపాధి
రైతులు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల తరువాత పలువురు నిరుద్యోగం సమస్య గురించి ప్రస్తావించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింతగా పెంచాలని, స్థానికంగా పరిశ్రమల స్థాపనకు పూనుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే కాదు.. మొత్తం జిల్లాలోనూ ఒక్క ఇంజినీరింగ్‌ కాలేజీ కూడా లేదు. జిల్లా కేంద్రంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదు. దూరప్రాంతాలకు వెళ్లి చదువులు పూర్తి చేసినా.. ఉద్యోగాలు లభిస్తాయనే గ్యారంటీ లేని పరిస్థితి ఉందని యువకులు వాపోయారు. కాగా, చేనేత కార్మికులు సంతృప్తిగానే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు ఆటుపోట్ల మధ్య బతుకులీడుస్తున్న తమకు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆరు నెలల పాటు ఉపాధి కల్పిస్తున్నాయని సంతోషంగా చెప్పారు. అలాగే, మగ్గంపై ఏడాదంతా పని దొరికే వెసులుబాటు కల్పించాలని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు రమేశ్‌ కోరాడు.

అక్కడా.. ఇక్కడా..
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని, మునుముందు కూడా ఇవి నిరంతరంగా కొనసాగాలని పలువురు కోరారు. అలాగే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని కోరుకున్న వారే.. కేంద్రంలో మాత్రం మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించడం విశేషం. ‘మోదీ పాలనలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా.. దేశ భద్రత విషయంలో మాత్రం రాజీ లేకుండా పని చేశారు. అందుకే మరోసారి మోదీ ప్రధాని అయితే ప్రపంచ దేశాల్లో భారత్‌ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంపొందుతాయ’ని వేములవాడకు చెందిన రవికిరణ్‌ తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇలా చెప్పిన వారిలో ఎక్కువ మంది యువత, విద్యార్థులే కావడం విశేషం. ఇక, వేములవాడ నియోజకవర్గం పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలంటూ ఆ ప్రాంతానికి చెందిన పలువురు తమ కష్టాలను చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడు అందుతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్టు రైతులు తెలిపారు.

సాయం చేసిండ్రు..
ఇరవై గుంటల్లో కూరగాయలు పెట్టిన. నీరు లేక వాడిపోతున్న వేళ పెట్టుబడి సాయం ఇచ్చిండ్రు. పాస్‌బుక్కులు వచ్చినయి. మంచి పనులు చేసిండ్రు. మాకు మరో పార్టీ గురించే ఆలోచన లేదు. టీఆర్‌ఎస్‌కే మద్దతునిస్తాం.     – జిర్ర రాజయ్య, జగ్గరావుపల్లె

ఈసారి హంగ్‌..
నరేంద్ర మోదీ పాలనలో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. బీజేపీ, కాంగ్రెస్‌∙పార్టీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. హంగ్‌ రావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితికి పది సీట్లు రావచ్చని అనుకుంటున్నాం.– పైవర్థ నాగేశ్వరరావు, పద్మనగర్‌

రాహుల్‌కీ అవకాశమియ్యాలె..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికాం. కేంద్రంలో యువ నాయకుడు రాహుల్‌ గాంధీ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ఉంది. కానీ యువకులు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.    – బొడిగె సత్తయ్యగౌడ్, మర్రిగడ్డ

రైతుబంధు ఆదుకుంది..
రైతులకు పెట్టుబడిగా పైసలిచ్చినోళ్లెవరు?. ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రైతుల కష్టాలను తెలుసుకుని ఆదుకుంది. నాకు నాలుగెకరాలు.. నాల్గు  బోర్లున్నా ఒక్కటీ నీరిస్తలేదు. అన్ని కష్టాల్లో నన్ను ఆదుకున్నవి కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధు డబ్బులే.      – గుమ్మడి వెంకటయ్య, హరిదాస్‌నగర్‌

ఈసారి ఇలా చేస్తాం..
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేశాం. పార్లమెంట్‌ ఎన్నికలు  వచ్చే సరికి జాతీయ స్థాయిలో చూడాలి. బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ ఎన్నికలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యనే జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ఊసే లేదు.   – వడ్లూరి వెంకటస్వామి, మర్రిపల్లి

కొత్త ఓటరు చూపు మోదీ వైపు..
నాకు పోయినేడాది ఓటు హక్కు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఓటు వేశాను. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వేయాలనుకుంటోంది మా యూత్‌. దేశ రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ మెచ్చుకుంటున్నారు.     – జి. రమ్య, డిగ్రీ స్టూడెంట్, మల్యాల

    ప్రాంతీయ
     పార్టీలతోనే పనులు
ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో జరిగేవి, కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని నిర్ణయించేవే అయినా.. మా ఓటు మాత్రం టీఆర్‌ఎస్‌కే. ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి పనులు జరుగుతాయని నమ్ముతున్నాం.
– రాపెల్లి చంద్రశేఖర్, ప్రైవేటు వాహన యజమాని. కోనాయపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement