ధూమ్..ధామ్‌గా
♦ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు 17 కమిటీల ఏర్పాటు
♦ జిల్లా సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు
♦ జూన్ 2న అమరవీరులకు నివాళితో ప్రారంభం
♦ జూన్ 7న శోభాయాత్రతో ముగింపు
♦ ‘సాక్షి’తో కలెక్టర్ శ్రీదేవి
అంబరాన్నంటేలా తెలంగాణ సంబరాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పేలా జిల్లాలో తెలంగాణ ఆవిర్బావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. గురువారం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు సంబంధించి ‘సాక్షి’ ప్రతినిధికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ వారోత్సవాల విజయవంతం కోసం ప్రత్యేకంగా 17 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
2వ తేదీ ఉదయం మహబూబ్‌నగర్‌లోని ఇందిరాపార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించడం ద్వారా ప్రారంభమయ్యే ఉత్సవాలు 7వ తేదీన నగరంలో శోభాయాత్రతో ముగుస్తాయని చెప్పారు. ఏడురోజుల పాటు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఉదయం - సాయంత్రం మహబూబ్‌నగర్ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ప్రాంతానికి గల చరిత్ర ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
2న అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వివిధరంగాల్లో అద్భుత ప్రతిభా పాటవాలు కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు మండల, జిల్లా స్థాయిలో అవార్డులు ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటైందని కలెక్టర్ చెప్పారు. ఈ కమిటీ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో సమావేశమై అవార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేస్తుందని వివరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 675 దరఖాస్తులు అవార్డుల కోసం అందాయని, అయితే వీటిలో ఇంకా ఏఏ మండలాల వారు దరఖాస్తు చేసుకోలేదో పరిశీలించి వారికి అవకాశం వచ్చేలా చూడాల్సి ఉందన్నారు.
జిల్లా కేంద్రంలో జూన్ 2న ఉదయం జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారని.. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే సభలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేసి ప్రసంగిస్తారని కలెక్టర్ వివరించారు. జూన్ 2నుండి ప్రతిరోజు సాహిత్యగోష్ఠి, అష్టవధానాలు, కవి సమ్మేళనాలు, సాహిత్యపరమైన చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తామని.. ఇవి జిల్లా పరిషత్ ఆడిటోరియంలో 7వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం సమయాల్లో జిల్లా పరిషత్ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు.
వీటిలో అత్యధికం మహబూబ్‌నగర్ జిల్లా సంస్కృతిని, సాంప్రదాయాలను, చరిత్రను చాటిచెప్పేవే ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన ప్రముఖులు, మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. వివిధరంగాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి చివరిరోజు జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తామన్నారు. జూన్ 6న రాష్ట్రస్థాయి కళాకారుల బృందం జిల్లాకు రానుందని.. దాదాపు 200 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. ఈ బృందానికి సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ నేతృత్వం వహిస్తారని.. వీరి కళాప్రదర్శన కోసం జెడ్పీ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆమె చెప్పారు. రూ.11కోట్లతో కొనుగోలు చేసిన 408 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని 130మంది నిరుపేద ఎస్సీలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
అభివృద్ధికి చిరునామాగా మహబూబ్‌నగర్‌ను మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక
రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో శ్రమశక్తికి కొదవ లేదని.. జిల్లాలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయ పరంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కొల్లాపూర్ మామిడికి ప్రసిద్ధి గాంచిందని అలాగే బాలాపూర్, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో అపారంగా పండిస్తున్న కూరగాయలు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందుకుగాను రైతులకు పంట దిగుబడిలో పాటించాల్సిన మెళకువలపై ఆధునిక సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని యోచిస్తున్నట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు.