సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించిన మేరకు తమకూ 30% వేతనం పెరిగిందన్న సంతోషం.. ఆ ఉద్యోగులకు మూడునాళ్ల ముచ్చటే అయింది. 2 నెలల పాటు వేతనాన్ని పెంచినట్లే పెంచిన ఉన్నతాధికారులు.. కొత్త సంవత్సరం రోజున గతంలో పెంచిన మొత్తాన్ని కూడా ఈ నెల వేతనం నుంచి మినహాయిం చడం వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. వేతన బకాయిలు రాక, ఈ నెల వేతనంలో భారీగా కోత పెట్టడంతో ఉద్యోగుల కుటుం బాలు పస్తులుండా ల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐడబ్ల్యూఎంపీ)లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ల దుస్థితి ఇది. మూడేళ్లుగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని (ఐటీడీఏ)గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రాజెక్ట్ అధికారులుగా సేవలందిస్తున్న వీరిని నిబంధనల ప్రకారం రెండేళ్ల అనంతరం హెచ్‌ఆర్ పాలసీలోకి తీసుకోవాల్సి ఉంది.
ఆ మేరకు వీరంద రికి ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్‌టీఈస్)గా గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తింపు లభించాల్సి ఉంది. పీవోలను ఎఫ్‌టీఈస్‌గా మార్చడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో ప్రభుత్వం వేతనాలను పెంచినా, వీరికి అందు కునే యోగ్యత లేకుండా పోయింది. గత అక్టోబర్ నెలలో గ్రామీణా భివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఉపాధిహామీ పథకాలలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులకు 30% మేర వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఇతర ఉద్యోగులతో పాటుగా ఐడబ్ల్యూఎంపీలో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న పీవోలకు కూడా 30% చొప్పున వేతనాన్ని (రూ.20 వేల నుంచి రూ.26 వేలకు) పెంచిన ఉన్నతాధి కారులు.. రెండు నెలల తర్వాత ప్రభుత్వమిచ్చిన వేతన పెంపు మీకు వర్తించ దంటూ రెండు నెలల్లో అదనంగా వచ్చిన రూ.12 వేల మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు.
పాత బకాయిలను పట్టించుకోరాయె..
ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత ఉందంటూ గతేడాది మే, జూన్ నెలల్లో పీవోలకు వేతనాన్ని ఇవ్వని ఉన్నతాధికారులు, ఆరు నెలలు దాటినా బకాయిల గురించి పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు.. ఓ వైపు వేతన బకాయిలు ఇవ్వకుండా, మరోవైపు పెంచిన వేతనాన్ని ఈ నెల వేతనం నుంచి కట్ చేయడంతో నెలరోజుల పాటు తమ కుటుంబాలు ఎలా గడవాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. వాటర్ షెడ్ ప్రాజెక్ట్‌ను కూడా ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టినందున తమకు వెంటనే వేతన పెంపును వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇలా పెంచారు..అలా తగ్గించేశారు!
Published Mon, Jan 9 2017 3:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
Advertisement
Advertisement