సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతం ఏప్రిల్ మూడో తేదీన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో సెలవులు కావడంతో 3 లోగా ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ.. అన్ని జిల్లాల ట్రెజరీలను ఆదేశించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు కోత పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం ఈ కోత అమలుకానుందని మంగళవారం జిల్లా ట్రెజరీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రోస్ స్పష్టతనిచ్చారు. కాగా, కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సాయంగా ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఉద్యోగుల వేతనాల నుంచి ఒకరోజు మూలవేతనాన్ని మినహాయించుకోవాల్సి ఉండగా, ఇంతవరకు ఉత్తర్వులు రాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో చెల్లించే మార్చి నెల జీతంలో ఒకరోజు మూల వేతనాన్ని కోతపెట్టాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీలకు సూచించింది. వేతనాల్లో కోతను ఎత్తేసిన తర్వాత ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వం మినహాయించుకోనుంది.
అప్పటివరకు ‘వాయిదా’అమలు..
కాగా, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం, 4వ తరగతి మినహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 50 శాతం, 4వ తరగతి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వేతనాన్ని వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీల వారీగా రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లను సైతం ఇలాగే వాయిదా వేయాలని కోరింది. ప్రభుత్వరంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలనూ ఇదే రీతిలో వాయిదా వేయాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ మేరకు వేతనాల్లోని కొంతభాగాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
వైద్య, పోలీస్, పారిశుధ్య ఉద్యోగులకు పూర్తి జీతం
కరోనా వైరస్ నియంత్రణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న వైద్య, పోలీస్, పారిశుధ్య ఉద్యోగులు, సిబ్బందికి వేతనాల్లో కోతల్లేకుండా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment