సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీల అతిపెద్ద ఉత్స వం.. మేడారం జాతరకు వేళయ్యింది. బుధవారం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి రావడంతో మహా జాతర ప్రారంభమవుతోంది. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర నిర్వహణకు మేడారం సిద్ధమైంది. వనదేవతల వారంగా భావించే బుధవా రం రోజున.. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. 4 ప్రాంతాల్లోనూ వనదేవతల పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతోంది. ఈసారి 1.40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచే కీలక ఘట్టం మొదలు
కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే ఈ మహజాతరలో తొలి ఘట్టం మంగళవారం మొదలు కానుంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా తయారు చేయడంతో ప్రారంభమవుతోంది. పెనక వంశానికి చెందిన పూజారులతో పాటు పూను గొండ్ల గ్రామస్తులు నిష్ఠతో ఈ పూజలు నిర్వహిస్తారు. ముందుగా తలపతి (పూజారుల పెద్ద) ఇంట్లో అమ్మవారికి తీసుకుని వెళ్లేపానుపు (పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు) సిద్ధం చేస్తారు. ఉదయం పానుపును డోలి వాయిద్యాల నడుమ ఆలయానికి తరలించి పూజలు చేస్తారు. దేవుని గుట్ట నుంచి తీసుకువచి్చన వెదురు కర్రతో పగిడిద్దరాజు పడిగెను సిద్ధం చేస్తారు. శివసత్తుల పూనకాలు, దేవుని మహిమతో తన్మయత్వం పొందిన పూజారులు పడిగెను ఆలయ ప్రాంగణంలోని గద్దెపై ప్రతిíÙ్ఠస్తారు. సుమారు 2 గంటలు పెళ్లి కుమారుడిగా భక్తులకు దర్శనం ఇచ్చే పగిడిద్దరాజును దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అనంతరం పూజారులు తలపతి ఇంట్లో సిద్ధం చేసిన పానుపుతో పాటు పడిగెను తీసుకుని కాలినడకన అటవీ మార్గాన బయలు దేరుతారు. పస్రా చేరుకున్నాక పగిడిద్దరాజుకు నేరుగా సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపైకి చేరుకుంటారు. ఇక్కడ వారి ఇరువురికి ఆదివాసీ సంప్రదాయంలో ఇరు పూజారులు ఎదుర్కోళ్లు, వివాహం జరిపిస్తారు.
5న సారలమ్మ, 6న సమ్మక్క
సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరం లోని ఈ కుగ్రామంలో చిన్న ఆలయంలో ప్రతిíÙ్ఠంచబడిన సారలమ్మ 5న బుధవారం సాయంత్రం మేడారం లోని గద్దె వద్దకు చేరుతుంది. కడుపు పండాలని కోరుకునేవారు.. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వందలాది మంది తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో వరం పడతారు. సారలమ్మను మోస్తున్న పూజారిని దేవదూతగా భావిస్తారు. సారలమ్మ జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. సారలమ్మ కొలువుదీరిన మరుసటి రోజున అంటే 6న గురువారం సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయమే పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు.
అనంతరం సమ్మక్క పూజామందిరం నుంచి వడరాలు, పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన సమ్మక్క ఆగమనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలు కుతూ చిలకలగుట్ట వద్దకు వెళ్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు.
మూడో రోజు మొక్కులు..
గద్దెలపై ఆశీనులైన సమ్మక్క–సారలమ్మ జాతరలో మూడో రోజు (7వ తేదీ) భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరె, సారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా పెడతారు. ఆ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచి్చన సమ్మక్క–సారలమ్మ నాలుగో రోజున (8 శనివారం) సాయంత్రం తిరిగివన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది.
మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు
గుండాల: అర్రెం వంశీయుల ఆరాధ్య దైవం, సమక్క భర్త అయిన పగిడిద్దరాజు సోమవారం మేడారం పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి అర్రెం వంశీయులు పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment