కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ | Sammakka Saralamma Jatara Starts Deities Reached Medaram | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ

Published Thu, Feb 6 2020 1:40 AM | Last Updated on Thu, Feb 6 2020 7:57 AM

Sammakka Saralamma Jatara Starts Deities Reached Medaram - Sakshi

బుధవారం మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మొద లైంది. కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధ వారం రాత్రి కొలువుదీరారు. అలాగే, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నం టింది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.50 గంటలకు గుడి నుంచి వెదురు బుట్ట (పట్టె మూకుడు)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయల్దేరారు. జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకొని మేడారం గుడికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను అర్ధరాత్రి 12.24  గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళ్తే.. సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేర తాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్ట (పట్టెమూకుడు) లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారల మ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాక ను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది.


తీసుకొచ్చారిలా..
సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్‌ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. ప్రత్యేక పోలీసుల బృందం రోప్‌పార్టీ (తాడు వలయం)గా ఏర్పడి వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున డీఆర్వో రమాదేవి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఇటీవలే బదిలీపై వచ్చిన పీవో హన్మంతు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడిషనల్‌ ఎస్పీలు దక్షిణమూర్తి, మురళీధర్, డీఎస్పీ విష్ణుమూర్తి మూడంచెలుగా 80 మందితో రోప్‌ పార్టీ, భారీ బందోబస్తును పర్యవేక్షించారు.

భక్త జన సందోహం
సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకో వడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్‌ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆర్టీసీ పాయింట్‌ మీదుగా, రెడ్డిగూడెం, ఊరట్టం, కాల్వపల్లి, నార్లాపూర్‌ మీదుగా లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెతు ్తన్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారులన్నీ కిటకిటలాడాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు తీరారు. 

నేడు కొలువుదీరనున్న సమ్మక్క
మేడారం జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి గురువారం చేరుస్తా రు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమ యంలో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న ములుగు జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ సమ్మ క్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటి ల్‌ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలు కుతారు. లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదు రేగి.. కోళ్లు, మేక లను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండేళ్లకోసారి ఈ తంతును సాగిస్తున్నారు. పగిడిద్దరాజు పూజారులు పసుపు–కుంకుమ, చీర సారెను, సమ్మక్క పూజారులు దోవతి, కండువాలను అందించారు. ఈ తతంగానికి మేడారం గ్రామం వేదికగా నిలిచింది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ, జంపన్న. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సమ్మక్క – పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు.  

సమ్మక్క ఆలయమే వేదిక  
మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మ«ంగళవారం మధ్యాహ్నం 4.30 గంటలకు మేడారానికి బయలుదేరగా మేడారానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. ప్రధాన పూజారులుగా పెనక వంశీయులు పెనక బుచ్చిరాములు, పెనక మురళీధర్‌ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క పూజారులు గుడికి చేరుకొని పగడిద్దరాజుతో వివాహ పూజలు చేశారు. అనంతరం సమ్మక్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క – పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు.  

నేడు సమ్మక్క గద్దెపైకి కంకవనం 
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తీసుకురావడం కీలకమైనది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరుకోకముందే అక్కడికి కంకవనం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం సమ్మక్కతల్లిని గద్దెపై ప్రతిష్టించడానికి ముందు కంకవనాలను అక్కడ ప్రతిష్టిస్తారు. కంకవనాలను తీసుకురావడంలో పూజారులు ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు సమ్మక్క పూజారులు కుటుంబీకులు రోజంతా ఉపవాసం ఉంటారు. సమ్మక్క పూజారులు, ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కంకవనానికి పూజలు నిర్వహించారు.

ఈ పూజ వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోవడమే కాకుండా ఎవరినీ దగ్గరకు రానివ్వరు. వనంలో పూజ ముగిసిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుంటారు. గురువారం తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి వెళ్తారు. అప్పటికే ఎంపిక చేసిన ఉన్న కంకను తీసుకుని మార్గమధ్యలో ఇంగ్లి ష్‌ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు చేస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు చేరుస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించి కంకను ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది.  

పూజారుల ఆగ్రహం
ములుగు: భద్రత విషయంలో పోలీసులు అతి చేస్తున్నారని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క పూజారి రమేశ్‌ను గద్దెల ప్రధాన ప్రవేశ మార్గం నుంచి అనుమతించక పోవడంతో ఆయన ఏకంగా తాళాలను పగులగొట్టి మరీ గద్దెల వద్దకు వెళ్లారు. దీంతో పాటు బుధవారం ఉదయం కన్నెపల్లి ఆడపడుచులు మేడారంలోని గద్దెను అలక (అలంకరణ)డానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 6.50కి సారలమ్మను ఆల యం నుంచి బయటికి తీసుకొచ్చారు. సమ్మక్క గుడి వరకు సాఫీగా సాగిన ప్రయాణం గుడి ప్రాంగ ణం వచ్చే సరికి గందరగోళంగా మారింది. ఒక వర్గం పూజారులు ఆలయం పక్కన ఉన్న విడిది స్థానంలో, మరో వర్గం పూజారులు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు దిగింది. మొత్తానికి పూజారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమ్మక్క – సారలమ్మ గద్దెల తాళాలను తమ వద్దే ఉంచుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement