Medaram Aerial View 2022: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవోపేతంగా జరుగుతుంది. మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమన ప్రక్రియ కొనసాగుతోంది. సమ్మక్క తల్లి రాకకు వేళ అవ్వడంతో మేడారం జనసంద్రంగా మారింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీసుకురానున్నారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలిస్తారు.
చదవండి: దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..
ఈ క్రమంలో జాతర పరిసర ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జంపన్నవాగు, కన్నెపల్లి, చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 60 కేజీల తెల్లబంగారం సమర్పించారు . కేసిఆర్ ఆయురారోగ్యాలతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అమ్మవారులను వేడుకున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో కేసిఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవేనలతో రాష్ట్ర సాధన తోపాటు రెండు సార్లు కేసిఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సీఎం కేసిఆర్ రేపు మేడారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఏర్పాట్లను పరిశీలించారు. జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
మేడారం జాతరకు జాతీయ హోదా లభించాలని అమ్మవారులను వేడుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై కేంద్రం కనిపించదు, వినిపించదు అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment