అటవీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన పట్టెడన్నం పెట్టి వారిలో శారీరక స్థితి బాగుపరచడంతోపాటు విద్యావంతులను చేయాలన్న ప్రభుత్వ ఆశయం కొందరు అధికారులు, దళారుల నిర్వాకంతో నీరుగారిపోతోంది.. గిరిజన ఆశ్రమ, సంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కు చెందిన ఉద్యోగులు మాయాజాలం చేస్తున్నారు.. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మన్ననూర్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని 54 పాఠశాలలతో పాటు నల్లగొండ జిల్లాలోని 62గిరిజన ఆశ్రమ, సంక్షేమ, కస్తూర్బా, మినీ గురుకులం పాఠశాల లకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ వస్తువులను మన్ననూర్ జీసీసీ నుంచి సరపరా చేస్తున్నా రు. ప్రతినెలా ఈ రెండు జిల్లాలకు సం బంధించి రూ.90 లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. వసతి గృహా లకు నెలకు సరిపడా సరుకులను సరఫరా చేసేందుకు ఐటీడీఏ టెండర్లు నిర్వహిస్తోంది. ఏటా గుర్తింపు కలిగిన ట్రేడర్స్ ఇందులో పాల్గొంటారు.
వీటి ని మన్ననూర్ జీసీసీ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపూర్‌లోని మహాలక్ష్మి, విఘ్నేశ్వర ట్రేడర్స్; నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని రాఘవేంద్రస్వామి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వెంకటదుర్గా ట్రేడర్స్ సరఫరా చేస్తున్నాయి. టెండరు సమయంలో కాంట్రాక్టర్లు శాంపిల్‌గా అధికారులకు నాణ్యత కలిగిన సరుకులు చూపిం చారు. ఆ తర్వాత నాసిరకం, పుచ్చు లు, మక్కినవి, ఎందుకూ పనికి రానివి, తక్కువ తూకాలతో ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తున్నారు. అందుకు గోదాం క్లర్కులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెబుతున్నారు.
ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పి డెప్యూటేషన్‌పై వార్డెన్లుగా వచ్చిన వారితో గోదాం క్లర్క్‌కు ఉన్న సంబంధాలు అక్రమాలకు ఊతమిస్తున్నాయి. ట్రేడ ర్ల నుంచి కొన్ని సమయాల్లో వచ్చిన నాణ్యమైన సరుకులను మార్పిడి చేసి అచ్చంపేట నుంచి నాసిరకం సరుకులను తెప్పించి బదలాయించడం వీరికి పరిపాటిగా మారింది. కార్యాలయంలోని ఓ సీనియర్ ఉద్యోగి ఈ తతంగం నడిపిస్తున్నట్లు అరోపణలున్నాయి. గత ఏడాది వచ్చిన సరుకులను కొందరు వార్డెన్లు గోదాం క్లర్క్ ద్వారా డబ్బు రూపేణా తీసుకోవాలనుకున్నా వీలు కాలేదు. దీంతో కార్యాలయం వెనక ఉన్న గదిలో ఏడాది పాటు సరుకులు నిల్వ ఉండటంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి. అప్పట్లో ఆడిట్ అధికారులు వాటి గురించి ప్రస్తావించినా పొంతనలేని సమాధానంతో గుట్టుచప్పుడు కాకుండా వాటిని మాయం చేశారు. అక్రమ లావాదేవీలకు అడ్డుపడకుండా ఉండేందుకు కొందరు నాయకులకు ముందుగానే కొంత మొత్తంలో డబ్బు ముట్టజెప్పి ప్రతినెలా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే విధి నిర్వహణలో ఏమాత్రం పరిజ్ఞానం లేని గోదాం క్లర్క్, మరికొందరు సిబ్బంది తమ విధులను మరొకరితో చేయించుకోవడం గమనార్హం. ఏదిఏమైనా గోదాం క్లర్క్‌ల అక్రమాలతో వసతి గృహాల్లోని విద్యార్థులు నాణ్యమైన భోజనం, వస్తువులు అందడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
కొన్ని సరుకులు తక్కువ ఉన్నప్పుడు అచ్చంపేట నుంచి కొనుగోలు చేయడం నిజమే. ట్రేడర్ల ద్వారానాణ్యతలేని సరుకులు వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో తిప్పి పంపిస్తున్నాం. ఓ గోదాంకు సంబంధించి అక్రమాలకు అవకాశం లేకుండా చూస్తున్నాను. మరో దానిలో అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వస్తే సహించేదిలేదు. ఉన్నతాధికారులకు నివేదించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-బాలకృష్ణ, జీసీసీ మేనేజర్, మన్ననూర్
శాంపిల్ ఒకటి.. సరఫరా మరొకటి!
Published Sat, Aug 2 2014 4:14 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement