
బరితెగింపు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో కీలక పాత్ర పోషించాల్సింది రెవెన్యూ, పోలీసు విభాగాలే. అయితే, ఇక్కడ మాత్రం ఈ రెండు శాఖల అధికారులు ఇసుక మాఫియాతో చెట్టపట్టాలేసుకున్నారు. దీంతో కాగ్నా, కాక్రవేణి నుంచి రూ.కోట్ల విలువ చేసే ఇసుక తరలిపోతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రతిరోజూ కర్ణాటకకు వందలాది లారీల్లో ఇసుక రవాణా అవుతున్న వ్యవహారం తెలిసినా పట్టించుకోరు.
ఇటీవల లక్ష్మీనారాయణపురంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడింది. వెంటనే ఓ చోటా నాయకుడు రంగంలోకి దిగారు. అంతలోనే జిల్లా ‘ముఖ్య’నేత పీఏను నుంచి ఫోన్. ఇంకేముంది ట్రాక్టర్ మాయమైంది. ఇక ఓ పోలీస్ ఉన్నతాధికారి అయితే ఏకంగా ఇసుకాసురులతో బేరం కుదుర్చుకున్నారు. నెలవారీ వాటాలను మాట్లాడుకున్న ఆయన.. ఇసుక మాఫియా జోలికి ఎవరూ వెళ్లకూడదని కింది స్థాయి అధికారులకు సంకేతాలిచ్చారు. పోలీసుల సహకారం పుష్కలం అందుతుండడంతో ఇసుక మాఫియా బరితెగించింది.
గతంలో రాత్రి వేళల్లోనే ఇసుకను తరలించే అక్రమార్కులు ఇప్పుడు పగటిపూట కూడా దర్జాగా తమ పని కానిచ్చేస్తున్నారు. ముడుపుల రూపేణా ముగ్గురు ‘ఖాకీ’దొరలకు రూ.15 లక్షల వరకు ముట్టజెపుతుండడం చూస్తే ఇసుక దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెవెన్యూ యంత్రాంగం అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా వ్యవహరించిన ముత్యాలరాజు ఇసుక దోపిడీకి కళ్లెం వేయగా, అదే దూకుడును కాట ఆమ్రపాలి కొనసాగించారు. కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ హరి నారాయణ్ పని ఒత్తిడితో ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తాండూరు ప్రాంత రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఓ రెవెన్యూ అధికారి రూ.10 వేలు పుచ్చుకొని ట్రాక్టర్‌ను వదిలేశారు.
ఇసుక డంపులు..!
రెండు వాగుల నుంచి రోజుకు సగటున 180 ట్రాక్టర్లు, 30 లారీల ఇసుక తరలిపోతున్నట్టు అంచనా. ఠాణాలు, రెవెన్యూ కార్యాలయాల ముందు నుంచే ఈ వాహనాలు వెళుతున్నా ముడుపుల మత్తులో మునిగిన అధికారుల కళ్లకు ఇవి కనిపించడంలేదు. యాలాల పరిసరాల్లో అడ్డగోలుగా ఇసుక స్టాక్ పాయింట్‌లు ఉన్నది బహిరంగ రహస్యమే అయినా వాటి జోలికి వెళ్లరు.
లక్ష్మీనారాయణపురం నుంచి బషీరాబాద్ వెళ్లే మార్గంలోని ఓ పరిశ్రమ వద్ద, యాలాలకు వెళ్లే మార్గంలో మరో పరిశ్రమ సమీపంలో అక్రమార్కులు ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు.. బెన్నూర్, విశ్వనాథ్‌పురం, సంగం కుర్ధు, కోకట్ తదితర గ్రామాల శివారుల్లో ఇసుక డంపులు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి సాయంత్రం వరకు స్టాక్ పాయింట్‌లకు తరలించి, అక్కడి నుంచి పొద్దుపోయిన తర్వాత కర్ణాటక, జహీరాబాద్, మహబూబ్‌నగర్‌లకు లారీల్లో రవాణా చేస్తున్నారు. పట్టణంలోని తాగునీటి పంప్‌హౌస్ సమీపం నుంచి పాతతాండూరు మీదుగా రాత్రి వేళ ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతోంది. స్థానికులు సమాచారం ఇచ్చినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించరనే విమర్శలూ ఉన్నాయి.
నెలకు రూ.4.50 కోట్ల ఇసుక అక్రమ వ్యాపారం
తాండూరు ప్రాంతంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. ఆయా వాగుల్లో ఇసుక మేటలు తక్కువగా ఉండటంతో తవ్వకాలపై నిషేధం ఉంది. కేవలం స్థానిక అవసరాలతోపాటు అభివృద్ధి పనులకు మినహా ఇసుకను వినియోగించాల్సి ఉంది. కానీ ఇక్కడ వాల్టా చట్టానికి తూట్లు పోడుస్తూ ఇసుకాసురులు వాగుల్లో సహజ సంపదను కొల్లగొడుతూ రూ.లక్షలు జేబులు నింపుకొంటున్నారు.
ఇసుక మేటలు తక్కువగా ఉన్నందనే ఇక్కడ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం యాక్షన్ పెట్టలేదు. ఇసుక తవ్వకాలతో వాగుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా అధికార యంత్రాంగం ఈ దందాకు అడ్డుకట్ట వేయని పరిస్థితులు నెలకొన్నాయి. నెలకు సుమారు రూ.4.50 కోట్ల అక్రమ ఇసుక వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. గనులు, రెవెన్యూ, పోలీసు, ఎంవీఐ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని గతంలో జిల్లా అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణలో సాధ్యంకాలేదు. భారీగా జరిమానాలు విధించడం, థెఫ్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.
అయితే ఇవి తూతూమంత్రంగానే సాగుతున్నాయి. ఇసుక తరలించే వాహనాలకు ఫిట్‌నెస్, లెసైన్స్ ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకున్నా ఎంవీఐ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. చాలా ట్రాక్టర్లు అగ్రికల్చర్ కోసం తీసుకుంటూ కమర్షియల్‌గా వినియోగిస్తున్నా (ఇసుక దందా) అధికారులు పట్టించుకోవడంలేదు. టాస్క్‌ఫోర్స్ బృందాల జాడే లేకుండాపోయింది. అధికారులు ఇప్పటివరకైనా నిద్రమత్తును వీడాల్సిన అవసరముంది.