ఆదిలాబాద్‌రూరల్: మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడుతున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఉంది. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, తలమడుగు, తాంసి, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఉట్నూర్ తదితర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా..వీటి నిర్వాహకులు గ్రామ పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారంలో 2 శాతం పన్ను చెల్లించాలని నిబంధనలు ఉన్నా..సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆదిలాబాద్‌రూరల్, మావలలోని మావల, కచికంటి, చించూఘాట్, అంకోలి, తంతోలి, యాపల్‌గూడ, అనుకుంట, బంగారిగూడ, బట్టిసావర్‌గాం, కచికంటి గ్రామపంచాయతీల శివారు పరిధిలో ఇటుక తయారీ బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా గ్రామ పంచాయతీ శివారుల్లో సుమారు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ఒక్క ఆదిలాబాద్‌రూరల్ మండలంలోనే వందకుపైగా బట్టీలు ఉండగా..మొత్తంగా 200 పైన ఉన్నాయి. ఏడాదిలో ప్రతీ బట్టీలోనూ దాదాపు లక్ష నుంచి పది లక్షల వరకు ఇటుకలు కాల్చి ఒక్కొక్కటి రూ.7 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తుంటారు.
ఒక యాజమాని కనీసం ప్రతీ వేసవిలో 5 నుంచి 10 లక్షల వరకు ఇటుకలు విక్రయిస్తారు. వీటి ద్వారా సుమారు రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. కారణం..విక్రయ సమయంలో ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీరాజ్ యాక్టు ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2 శాతం పంచాయతీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి గండీ పడుతుంది. ప్రతీ ఇటుక బట్టీతో వ్యాపారులు లాభాలు అర్జిస్తుంటే పంచాయతీలకు మాత్రం పన్ను కట్టడం లేదు. బట్టీల నిర్వాహణకు పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలు ఉన్న వాటినీ పట్టించుకోవడం లేదు.
పచ్చని పొలాల్లో..?
భూ పరిరక్షణ చట్టం 129/12లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఇటుక బట్టీలు నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పంట భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు.రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. జిల్లా కేంద్రానికి కూత వేటులో దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా పంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి. ఇదిలా ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో సైతం ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది.
అంతేకాకుండా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఇటుక బట్టీ వ్యాపారులు అటువైపు నుంచి ప్రవాహిస్తున్న వాగుల్లోనే ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అసలే ఖరీఫ్‌లో పంటల దిగుబడి రాకపోవడంతో రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పారుతున్న వాగుల నుంచి రబీ సాగుకు నీళ్లను అందిద్దామంటే యథేచ్ఛగా ఇటుక వ్యాపారులు వాగులకు మోటార్లు ఏర్పాటు చేసుకొని ఇటుకల తయారీకి వాడుకోవడంతో వాగుల నీళ్లు ఇంకిపోతున్నాయి. దీంతో పంటల సాగుకు నీళ్లు పూర్తి స్థాయిలో అందక పంటలు సైతం ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు.
గుట్టల నుంచి మట్టి తవ్వకాలు
ఆయా మండలాల పరిధిలో ఇటుకల తయారీ కోసం కొంతమంది ఇటుక వ్యాపారులు ఏజెన్సీ ప్రాంతంలో ఇటుకల తయారీ కోసం ఏకంగా గుట్టల నుంచి మట్టి తవ్వి ఇటుకల తయారీ కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏపుగా పెరిగిన చెట్లను సైతం నరికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment