మూడు నెలలుగా ముగియని పారిశుద్ధ్య టెండర్ల ప్రక్రియ
నేడు ఖమ్మంలో పరిశీలన, పనులు అప్పగించడంపైనే ఉత్కంఠ
ఖమ్మం: టెండర్లు మార్చిలోనే ముగిసినా.. పనులు అప్పగించక, ప్యాకేజీల వ్యవహారం కొలిక్కి రాక.. ఖమ్మం కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్య పనులు అప్పగించే వ్యవహారం గందరగోళంగా మారింది. 21 ప్యాకేజీలను ఆరుకు కుదించడం.. కార్మికులకు కాకుండా ఇతర ఫెడరేషన్‌కు బాధ్యతలు ఇచ్చేందుకు మొగ్గు చూపడంపై విమర్శలు తలెత్తాయి. వర్కర్లపై పర్యవేక్షణ కొరవడుతోందని, పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సోమవారం ఖమ్మంలో టెండర్లు పరిశీలించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు 6 ప్యాకేజీలే..
పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు, కార్మికులపై పర్యవేక్షణకు గతంలో 21 ప్యాకేజీలు ఉండగా..ఇప్పుడు 6 ప్యాకేజీలకు కుదించారు. దీనిపై ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 11 ప్యాకేజీలు ఉండేవి. ఖానాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 236మంది కార్మికులు ఉండేవారు. ఖమ్మంలో కాంట్రాక్టర్ల పరిధిలో, ఖానాపురం హవేలీలో ఈఓ పర్యవేక్షించేవారు. శివారులోని 9 గ్రామ పంచాయతీలు విలీనమై 50 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పడ్డాక 21 ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం 580 మంది కార్మికులు ఉన్నారు. ఒక్కో ప్యాకేజీలో 20 నుంచి 50 మంది కార్మికులు ఉన్నప్పుడే పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వచ్చాయి. అలాంటిది 6 ప్యాకేజీలుగా కుదించి టెండర్లు పిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్యాకేజీలో వందమంది కార్మికులుంటే ఎలా పర్యవేక్షిస్తారని ఇటీవల ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కార్మిక సంఘాల గుర్రు..
మూడు ప్యాకేజీలను మహాత్మాగాంధీ టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్‌ఎఫ్)కు అప్పగించేందుకు గతంలో తీర్మానం చేయడంపై కార్మిక సంఘాల నాయకులు గుర్రుగా ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక మంది మహిళలే. డ్వాక్రా గ్రూపు సభ్యులే అయినా..పనులు కేటాయించకుండా మహాత్మా గాంధీ ఫెడరేషన్‌కు అప్పగించేందుకు మొగ్గు చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కమిషనర్ తీరు మారాలని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగారు కూడా. మహిళా సంఘాలకు పనులు అప్పగించడం ద్వారా బాధ్యత కార్పొరేషన్ ఉద్యోగులే చూసుకుంటారని, కేవలం డబ్బులు పంపిణీ చేసేందుకే మహిళా సంఘాల సహకారం ఉంటుందని కార్పొరేషన్ అధికారులు వివరణ ఇస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తే..తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లించకుంటే జీతాల్లో కోత పడే ప్రమాదముందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వేతనాల చెల్లింపులో సహకరించినందుకు 2శాతం సర్వీస్ చార్జీలు వస్తాయని మెప్మా అధికారులు చెబుతుండగా.. ప్యాకేజీకి నెలకు రూ.8 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పడం..కార్మికుడికి ఒక్కింటికి నెలకు రూ.200 చొప్పున సర్వీస్ చార్జీ ఇవ్వాలని ఫెడరేషన్ నిర్వాహకులు అంటుండడంతో అంతా గందరగోళం నెలకొంది.
నేడు టెండర్ల పరిశీలన..
నూతన కాంట్రాక్టర్లకు ప్యాకేజీలను కేటాయించేందుకు సోమవారం కాంట్రాక్టర్లు ఆన్‌లైన్‌లో వేసిన టెండర్లను అధికారులు పరిశీలించనున్నారు. ఐదు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులకు, మూడు పారిశుద్ధ్య పనుల కోసం కాంట్రాక్టర్ల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అధికారుల ప్రకటనతో పలువురు కాంట్రాక్టర్లు వేసిన టెండర్లను సోమవారం ఓపెన్ చేసి, టెండర్ల పరిశీలన అనంతరం పనులు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్యాకేజీ..నాన్చుడేంది..!
Published Mon, Jun 20 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement