సమ్మెకు కార్మిక ఐక్య సంఘటన నోటీసు: సంజీవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని మోసం చేస్తున్నారని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు జి.సంజీవరెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సమ్మెకు దిగనున్నట్ల ప్రకటించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియాతో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, సకల జనుల సమ్మెకు వేతనం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాలతో కలసి సమ్మెకు దిగనున్నామని, ఇందుకు సంబంధించి నోటీసిచ్చామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా రూ. 40 వేల కోట్ల కార్మిక సంక్షేమ నిధితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలు చేస్తున్నాయని కుంతియా ఆరోపించారు