భర్త వేధింపులతోనే శరణ్య ఆత్మహత్య
ముషీరాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారి వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని శిక్షించాలని కరీనంగర్‌లోని కాపువాడకు చెందిన మృతురాలి తల్లిదండ్రులు మోహన్, విజయ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ చిన్న కుమార్తె శరణ్య(25)ను రామగుండం ఎన్టీపీసీకి చెందిన ఎం.మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో వివాహం జరిపించామన్నారు. రూ.10లక్షలు నగదు, 30తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.30లక్షలు విలువ చేసే రెండుగుంటల స్థలాన్ని కట్నం కింద ఇచ్చామన్నారు. తమ కుమార్తె ఓసాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా పెళ్లయిన తరువాత ఉద్యోగం మానిపించి మధుకర్ తనతోపాటు బెంగళూరు తీసుకెళ్లారన్నారు.
అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలకు గురిచేయడంతో ఈ నెల 3న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె ఏడు నెలల గర్భవతిని చెప్పారు. శరణ్య మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందన్నారు. మధుకర్ తనకున్న పలుకుబడితో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, కరీంనగర్ ఎస్పీ స్పందించి తమ కుమార్తె ఆత్మహత్యకు కారుకులైన మధుకర్, అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయూలని కోరారు.