చెరువు తల్లిని కాపాడుకుందాం..
Published Mon, Mar 23 2015 6:58 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
చెరువులు నిండితేనే సస్యశ్యామలం
మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలి
పూడికతీత పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్
చిన్నశంకరంపేట: చెరువు గ్రామానికి తల్లిలాంటిదని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. అలాంటి తల్లిని కాపాడుకునేందుకు మిషన్ కాకతీయ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూర్ గ్రామ కుడి చెరువు పనులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఆదివారం హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గతంలో చెరువులు నిరాదరణకు గురయ్యాయన్నారు. గతంలో చెరువు కింద పొలం ఉంటేనే ఊర్లో పిల్లగానికి పిల్లనిచ్చేవారన్నారు. గత కొన్నేళ్లుగా చెరువులు నిండక పోవడంతో అనేక మంది అవస్థలు పడుతున్నారని తెలిపారు. చెరువు నిండితేనే ఊర్లో అందరికి పండుగన్నారు. సాగుతోపాటు చేపల పెంపకం, ఈత, కానుగ చెట్ల పెంపకంతో ఎందరికో ఉపాధి లభిస్తుందన్నారు. చెరువు శిఖంతోపాటు ఎఫ్‌టీఎల్ కూడా నిర్ధారించి ఆక్రమణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువు మ్యాప్‌లను గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేయాలని తెలిపారు.
చెరువుల వద్ద సాయిల్ రిపోర్టు..
చెరువు మట్టి పొలానికి ఎంతో బలమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. మిషన్ కాకతీయ కింద ఎంపికైన చెరువుల నుంచి సాయిల్ రిపోర్టులను తెప్పించినట్టు చెప్పారు. ఈ వివరాలను ప్రతి చెరువు వద్ద బోర్డులు ఏర్పాటు చేసి వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, ఈఈ ఏసయ్య, జిల్లా సలహాదారులు మల్లయ్య, ఆర్డీఓ నగేష్‌గౌడ్, ఎంపీపీ అధ్యక్షులు కృపావతి, జెట్పీటీసీ సభ్యులు స్వరూప సురేందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ ధనలక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, రామ్‌రెడ్డి, రాజు, నరేందర్, మనోజ్, రంగారావు, సాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చెరువుల పునరుద్ధరణతోనే వ్యవసాయాభివృద్ధి
చేగుంట: చెరువుల పునరుద్ధరణతోనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి చెరువులో రూ.11 లక్షలతో చేపట్టే మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని 46 వేల చెరువులకు మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు, కేంద్రం రూ. 2 వేల కోట్లు, జైకా రూ.3 వేల కోట్లు, ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తుందన్నారు.
గ్రామాల్లో యజ్ఞంలా నిర్వహిస్తోన్న మిషన్ కాకతీయ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు విజయవంతం చేయాని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ రాజయ్య, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ నిర్మల, ఎంపీపీ రమ, జెడ్పీటీసీ కర్న శోభ, సొసైటీ చైర్మన్లు వెంగళ్‌రావ్, నారాయణరెడ్డి, నాయకులు ముదాం శ్రీను, సండ్రుగు స్వామి, మంచుకట్ల శ్రీనివాస్, మాసుల శ్రీనుతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement