ఈ అందమైన రాళ్లు ఎన్నాళ్లుంటాయో..
నరుడి దృష్టి పడితే నల్లరాయి కూడా పగిలిపోతుందని ఓ నానుడి. కానీ మానవుడి కన్ను పడితే రాళ్లే కాదు.. కొండలు, గుట్టలు సైతం మాయమైపోతున్నాయి. భాగ్యనగరానికి రక్షణ వలయాలైన రాళ్లు కరిగిపోతున్నాయి. వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన కొండలు, గుట్టలు రాతిగుండె స్వార్థానికి తరిగిపోతున్నాయి. ఆకాశ హరŠామ్యల నిర్మాణంతో ఒకప్పుడు నగరానికే అందాలనిచ్చిన నిలివెత్తు కొండలు, ఒకదానిపై ఒకటి పేర్చినట్లుండే గుట్టలు, హ్యాంగింగ్ రాక్స్, చక్కటి ఆహ్లాదాన్ని, పర్యాటక అనుభూతిని పంచిపెట్టిన రాతి సంపద ఉనికిని కోల్పోతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన రాక్ కారిడార్లు సైతం దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోవడం లేదు. చెరువులు, అడవులు వంటి ప్రకృతి సంపదను బయోడైవర్సిటీలో భాగంగా గుర్తించిన ప్రభుత్వం.. కొండలు, గుట్టలను మాత్రం విస్మరించింది. దీంతో ఎక్కడికక్కడ గుట్టలను తొలగించి కాలనీలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న కొండలను, గుట్టలు, రాళ్లను కాపాడేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమిస్తున్న ‘సేవ్‌రాక్ సొసైటీ’ ఈ ఆదివారం (2వ తేదీ) ‘రాక్‌రన్’ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్, పలు కాలనీల సంక్షేమ సంఘాలు, ప్రజలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కలగా మిగిలిన కారిడార్లు
నగరంలో వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా వందల ఏళ్ల నాటి కట్టడాలను గుర్తించినట్టుగానే ప్రకృతి సంపద పరిరక్షణలో భాగంగా వందలకొద్దీ గుట్టలను, కొండలను అధికారికంగా గుర్తించారు. హైటెక్‌సిటీ చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలు ఒకప్పుడు కొండలు, గుట్టలతో అలరారేవి. రాయదుర్గం బొటానికల్ గార్డెన్, మల్కంచెరువు, బయోడైవర్సిటీ పార్కు, దుర్గం చెరువు, పీరం చెరువు, ఖాజాగూడ, శామీర్‌పేట్ చెరువు, శంషాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో కొండలను, గుట్టలను అధికారికంగా గుర్తించారు. కానీ 2015 నాటికి వాటిలో చాలా వరకు డీనోటిఫై అయ్యాయని, అనేక చోట్ల గుట్టలను తొలగించి బహుళ అంతస్తుల భవనాలను కట్టించారని సేవ్‌రాక్స్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పీరం చెరువు దగ్గర ఉన్న సంహితహిల్స్ ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేవి. కానీ ఇప్పుడక్కడ గుట్టలను తొలగించి అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అలాగే చిన్న అమీన్‌పూర్ చెరువును ఆనుకొని ఉన్న గుట్టలు కూడా కనుమరుగయ్యాయి. రాజేంద్రనగర్‌తో పాటు అనేక చోట్ల గుట్టలు, కొండలు కబ్జారాయుళ్ల హస్తగతమయ్యాయి. ‘మల్కం చెరువు నుంచి దుర్గం చెరువు వరకు, అక్కడి నుంచి ఖాజాగూడ వరకు ట్రయాంగిల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ అమలుకు నోచుకోవడం లేదు’ అని సేవ్ రాక్స్ సొసైటీ ప్రతినిధి అమర్‌దీప్ చెప్పారు. దుర్గం చెరువు వద్ద రాక్‌కారిడార్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశం కూడా ప్రతిపాదనతోనే ఆగిపోయింది.
క్లైంబ్ స్పోర్ట్స్‌కు ఎంతో కష్టం
ఎత్తయిన కొండలు, గుట్టలపై నిర్వహించే ట్రెక్కింగ్ పోటీల పట్ల పిల్లలు, యువతలో ఎంతో ఆసక్తి ఉంది. కానీ అలాంటి క్రీడలకు నగరంలో అవకాశం లేకుండాపోయింది. ‘ఒలింపిక్స్‌లో కూడా క్లైంబింగ్ చాంపియన్‌షిప్ పోటీలు పెట్టారు. కానీ ఇలాంటి పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ పొందాలంటే నగరంలో సాధ్యం కాదు’ అని అమర్‌దీప్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌ను భూకంపాల నుంచి రక్షించడంలో కొండలు, గుట్టలే ఎంతో కీలకమైనవని ఎన్‌జీఆర్‌ఐ గతంలోనే స్పష్టం చేసింది. కానీ నగరంలో మాత్రం లాంటి అడ్డు, అదుపు లేకుండా కొండలు, గుట్టల విధ్వంసం సాగిపోతోంది.
రేపు రాక్‌రన్
ఖాజాగూడ సమీపంలోని ఫకృద్దీన్ గుట్ట రక్షణ కోసం సేవ్‌రాక్స్ సొసైటీ పెద్ద ఎత్తున ఆన్‌లైన్ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ ఆదివారం అక్కడికి సమీపంలోని మెహర్‌బాబా కేవ్స్ నుంచి గుట్ట వరకు రాక్ రన్ తలపెట్టినట్టు సంస్థ ప్రతినిధి పద్మిని పటేల్ తెలిపారు. ఉదయం 5 నుంచి 5.30 వరకు 5కే రన్, 10కే రన్, 16కే రన్, 32కే రన్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment