బీజేపీకి బుద్ధి చెప్పాల్సిందే
సిద్దిపేట టౌన్: ‘త్యాగాలతో తెలంగాణను సాధించాం.. దీనిని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ను గల్లంతు చేయాల్సిందే. అప్పుడే కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది. తెలంగాణ వ్యతిరేక విధానాలను మానుకుంటుంది. ధైర్యంగా ప్రధానమంత్రిని కలిసి వివక్షతపై మాట్లాడగలుగుతా’మని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు స్పష్టం చేశారు. స్థానిక శక్తి గార్డెన్‌లో ఆదివారం జరిగిన సిద్దిపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. వెయ్యి మంది చనిపోతే కాంగ్రెస్ మంత్రులు, పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. ప్రజలే తెలంగాణకు దశను, దిశను నిర్దేశిస్తారని, వారే రథసారథులన్నారు. వారి ఆశలే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోగా తయారైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. రాష్ట్రం విడిచిపోతానని చెప్పిన జగ్గారెడ్డి మళ్లెట్ల పోటీకి దిగాడని ప్రశ్నించారు. నీచుడైన జగ్గారెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు.
జగ్గారెడ్డిని దెబ్బతీయడానికి ఇదే అదను: మంత్రి ఈటెల
సిద్దిపేటకు రూ. 110 కోట్ల నిధులు రాకుండా లేఖ రాసిన వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని దెబ్బతీయడానికి ఇదే సరైన అదను అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమస్యలను పరిష్కరించాలని మొత్తుకున్నా కలిసిరాని సునీతాలక్ష్మారెడ్డికి ప్రజలు ఓట్లు వెయ్యరాదన్నారు. సమైక్యవాదులకు ఊడిగం చేసిన అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కరెంటు కష్టాలకు సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. ఖమ్మం, ఇల్లెందు, ఎన్‌టీపీసీ, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పాదనకు కృషి జరుగుతుందని, 12 వేల మెగావాట్ల విద్యుత్ లభిస్తుందని అప్పుడే కరెంటు కష్టాలు తీరుతాయన్నారు. ఉద్యమాలు చేయడమే కాదు పరిపాలన నైపుణ్యాలు కూడా తెలుసునని టీఆర్‌ఎస్ సర్కార్ నిరూపించుకుంటోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపిద్దాం: ఏనుగు రవీందర్‌రెడ్డి
మెదక్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపిద్దామని కరీంనగర్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక దెబ్బకు ఢిల్లీ కదలాలన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ బాబు వల్లనే తెలంగాణకు కరెంటు కష్టాలన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యర్థుల దిమ్మ తిరిగే మెజార్టీని అందించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి మాట్లాడుతూ సిద్దిపేట తెలంగాణ దశ, దిశను నిర్దేశిస్తోందన్నారు.
చంద్రబాబును ఏపీకే పరిమితం చేయాలి: మైనంపల్లి
తెలంగాణపై కుట్రలు కొనసాగిస్తున్న చంద్రబాబునాయుడిని మెదక్ ఉప ఎన్నిక ద్వారా చిత్తుగా ఓడించి మళ్లీ ఈ ప్రాంతంలో పోటీ పడకుండా, ఏపీ రాష్ట్రానికే పరిమితమయ్యేలా చేయాలని టీఆర్‌ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు పిలుపునిచ్చారు. తెలంగాణలోనే టీడీపీ అడ్రస్ గల్లంతు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ నేత నరేంద్రనాథ్ మాట్లాడుతూ ఉప ఎన్నికలో బీజేపీ బక్రా కానుందన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికే జగ్గారెడ్డిని ఇద్దరు నాయుళ్లు చేరదీశారన్నారు.
రైల్వే లైన్ సాధిస్తా: అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట గల్లీగల్లీలో తిరిగానని, ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యను చదివానని టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఏ కష్టమొచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ నేతలు నయ్యర్‌పటేల్, వేలేటి రాధాకృష్ణశర్మ, నవాబ్, తుపాకుల బాల్‌రంగం తదితరులు ప్రసంగించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు సారయ్య, స్వామిచరణ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్న, మాణిక్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, బచ్చు రమేష్, పాల సాయిరాం, కరాటె కృష్ణ, గుండు శ్రీను, శేషుకుమార్, బూర మల్లేశం, మహిళా నాయకురాలు బూర విజయ, నందాదేవి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.