
ఎస్సీ సహకార సంస్థ చైర్మన్‌గా పిడమర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ షెడ్యూల్ కులాల సహకారాభివృద్ధి సంస్థ (టీఎస్‌సీసీడీసీ) చైర్మన్‌గా పిడమర్తి రవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లైంది. ఉద్యమం సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన విద్యార్థి సంఘ నాయకుల్లో రవి ఒకరు.
తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌గా కొనసాగుతున్న పిడమర్తికి నామినేటెడ్ పోస్టుల్లో తొలి ప్రాధాన్యం దక్కింది. వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్‌సీసీడీసీ లిమిటెడ్‌కు సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. చైర్మన్ పదవీ స్వీకారం చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు ఈ సంస్థ కాలపరిమితి ఉంటుంది.
ఈ మేరకు బుధవారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్‌ను తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను కూడా జారీ చేసింది. ఈ నియామక ఉత్తర్వులను పిడమర్తి రవికి సీఎం కేసీఆర్ బుధవారం స్వయంగా సచివాలయంలో అందజేశారు.
ఇది విద్యార్థి లోకానికే గుర్తింపు: రవి
తెలంగాణ విద్యార్థి లోకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన గుర్తింపే తన నియామకమని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(టీఎస్‌సీసీడీసీ) చైర్మన్‌గా నియమితుడైన పిడమర్తి రవి అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన తనకు మళ్లీ పిలిచి కేబినెట్ ర్యాంక్‌తో చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.