సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన టీఆర్‌ఎస్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా రాజకీయ పునరేకీకరణపై దృష్టి సారించింది. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విద్యార్థి నేతలకు వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఈ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులు దక్కాయి. దీంతో చాలాకాలంగా టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగంలో పనిచేస్తున్న నేతలతోపాటు ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన మరికొంతమంది విద్యార్థి నేతలు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఏడాది శాసన మండలిలో 21 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పూర్తిగా రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ ఉప ఎన్నికలతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీలో విద్యార్థి, యువనేతలకు అవకాశాలు ఇచ్చారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసే లక్ష్యంతోనే కేసీఆర్ యువతకు పట్టం కడుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోనూ యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. పార్టీ విద్యార్థి, యువజన, సోషల్ మీడియా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా చురుకైన వారికి అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
తొలి విడతలో కొందరికే..
2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగంలో చురుగ్గా పనిచేసిన బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీగా, విద్యార్థి నాయకులు గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, పిడమర్తి రవికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. పిడమర్తి మినహా మిగతా అందరూ విజయం సాధించారు. తర్వాత పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన విద్యార్థి నేత బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా, మరో విద్యార్థి నేత బాబా ఫసీయొద్దీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఉద్యమ సమయంలో విద్యార్థి నేతలుగా పనిచేసిన డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి (వికలాంగుల కార్పొరేషన్), రాకేశ్ (టెక్నాలజీ సర్వీసెస్) కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆంజనేయులు గౌడ్ బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు.
టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బాల్క సుమన్, గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్‌లుగా పనిచేస్తుండగా, చాలాకాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థి నేతలకు ఇటీవలి కాలంలో కేసీఆర్ వరుస అవకాశాలు ఇస్తున్నారు. రెండేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ తాజాగా వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేతిరెడ్డి వాసుదేవరెడ్డికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ కాలం పొడిగించగా, పాటిమీద జగన్మోహన్‌రావు, మన్నె క్రిషాంక్, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కిషోర్, శుభప్రద్ పటేల్‌కు వివిధ కార్పొరేషన్లు, కమిషన్లలో చైర్మన్లు, సభ్యులుగా పదవులు లభించాయి.
మరికొందరు ఆశావహులు
బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించగా, పిడమర్తి రవి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నా రు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, రాజా రాం యాదవ్, ఆంజనేయులు గౌడ్, నేవూరు ధర్మేందర్‌రెడ్డి, తుంగ బాలు తదితర యువ నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన చోట వీరిని అభ్యర్థులుగా నిలిపే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థి, యువనేతలు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment