నల్లగొండ టూటౌన్ : కాలం మారింది.. వాటితో పాటే జనం మారుతున్నారు..అంతా ఉరుకుల పరుకుల జీవితం..వినియోదారులు ఇలా వచ్చి అలా వస్తువులు తీసుకుపోతున్నారు. ఈ మార్పును గమనించిన వ్యాపారులు ప్రజల అవసరాలను ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నారు. కిరాణా షాపుల్లో ఏ వస్తువు విక్రయించినా దాని మీద పూర్తి వివరాలు ఉండాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో అవి కనిపించడం లేదు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు రాలేదనే ఒక్క మాటతో సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు చిరు వ్యాపారులపై అడపా దడపా దాడులు చేసి కేసులు చేస్తున్నారే తప్ప రూ.లక్షల వ్యాపారం చేసే వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకుండానే..
జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, హాలియ, నకిరేకల్, దేవరకొండ తదితర పట్టణాల్లో కిరాణా వ్యాపారం ప్రతి రోజు లక్షల్లో జరుగుతోంది. ఆయా పట్టణాల్లో ఎక్కువ శాతం దుకాణాల్లో ప్యాకేజీ చేసిన నిత్యవసర వస్తువులు దర్శనమిస్తున్నాయి. నిత్యవసర వస్తువులను ప్యాకేజీ చేయాలంటే తప్పని సరిగా తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే తమ తమ దుకాణాల వెనకనో లేదా మరో చోటనే కంది పప్పు, పెసర పప్పు, మైనం పిండి, మినుప గుండ్లు, చక్కెర, గోదుమ పిండి తదితర వాటిని స్వయంగా వ్యాపారులే తయారు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి అన్ని పప్పు ధాన్యాలను బస్తాల్లో తెచ్చి స్థానికంగా ఒక కిలో, అరకిలో ప్యాకెట్‌లు తయారు చేస్తున్నారు. ప్యాకేజీ చేయడానికి జిల్లాలో ఒక్క దుకాణానికి కూడా జిల్లా తూనికల కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. కార్పోరేట్ దుకాణాల వారికి మాత్రమే తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతి ఉంది. జిల్లా వ్యాప్తంగా చిన్నవి, పెద్ద కిరాణా దుకాణాలు కలిపి సుమారు 5200 వరకు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో అతి పెద్దవైన 450 దుకాణాదారులు స్వయంగా ప్యాకేజీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముద్రణ లేని ప్యాకేజీ విధానం ...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నిత్యవసర వస్తువుపై కచ్చితంగా సంబంధిత కంపెనీ చిరునామాతో పాటు పూర్తి వివరాలు ఉండాలి. ప్రతి ప్యాకెట్‌పై ధర, దాని బరువు, ఎప్పుడు ఎక్కడ తయారు చేసింది .. తేదీ, కంజూమర్ నంబర్ తదితర వివరాలతో కూడిన ముద్రణ ఉండాలి. ఆయా ప్యాకెట్లపై ఏవిధమైన వివరాలు లేకుంటే జీరో దందా కిందకు వస్తుంది. అదే విధంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే ప్యాకేజీ తయారు చేయడం వలన తూకాల్లో కూడా తేడాలు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కనీసం ఆయా కిరాణ దుకాణాదారులు కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు కూడా ఇస్తున్న పాపాన పోవడంలేదు. అక్రమ దందాలో రాటుతేలిన కొంత మంది వ్యాపారులు ఇటు వినియోగదారులను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సబంబంధిత అధికారులు మేల్కొని బడా వ్యాపారుల అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment