టమోత.. ఉల్లి ఘాటు
నల్లగొండ టుటౌన్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టమాటా, ఉల్లి ధరలు రోజు రోజుకూ పోటా పోటీగా పెరుగుతుండడంతో సామాన్యులు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కేజీ టమాటా రూ. 50 ఉండగా, ఉల్లిగడ్డలు కిలో రూ.28లు పలుకుతోంది. వర్షాభావ పరస్థితులే టమాటా, ఉల్లిగడ్డల ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరం వర్షాలు అధికంగా కురవడంతో పంటలు దెబ్బతిని ఉల్లి ధరలు పెరిగాయి. ఈ సంవత్సవం వర్షాలు తక్కువగా కురవడంతో నిత్యావసరాలు వినియోగదారుడికి భారంగా మారుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో టమాటా కిలో రూ. 20 ఉంటే ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 లకు పెరిగింది. గత సంవత్సరం కిలో రూ. 10గా ఉన్న ఉల్లి వారం క్రితం రూ.20లకు కిలోగా ఉండగా ప్రస్తుతం కిలో రూ.28 పలుకుతోంది. ప్రతి రోజు కూరల్లో వినియోగించే టమాట, ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
చిత్తురు టు నల్లగొండ
ప్రతి సంవత్సరం నల్లగొండ కూరగాయల మార్కెట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే టమాటా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. లోకల్ నుంచి టమాటా రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇదే ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇక్కడ వర్షాలు కురవక పోవడంతో టమాటా సాగు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. నల్లగొండ మార్కెట్‌కు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, కలిగిరి ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతోంది. దాంతో ట్రాన్స్‌పోర్టు చార్జీలే అధికమవుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు
ఉల్లిగడ్డలు జిల్లాకు ఎక్కుగా మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతాయి. గత ఏడాది కిలో రూ.10లు ఉన్న ఉల్లి ఈసారి ఏకంగా రూ. 28లకు చేరింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలే ధరల పెరగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అప్పుడు వచ్చిన భారీ వర్షాలకు ఉల్లిపంట కొట్టుకుపోయాయి. అప్పటి ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఉల్లి , టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అప్పటి వర్షాలే కారణం
మహారాష్ట్రలో గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా ఉల్లి దిగుమతి తగ్గిపోయిందని హైదరాబాద్ వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ఉల్లి ధరలు పెరిగాయి. మల్లీ కొత్త ఉల్లిగడ్డలు వచ్చే వరకు ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
- పున్న గీత, వ్యాపారి
లోకల్ టమాటా రావడంలేదు
నల్లగొండ చుట్టు పక్కల ప్రాంతాల నంచి వచ్చే టమాటా పూర్తిగా బంద్ అయ్యింది. వర్షాలు కురవక రైతులు టమాటా సాగు చేయలేదు. చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ట్రాన్స్‌పోర్టు చార్జీలే ఎక్కువై ధర పెరిగింది.
- చింత యాదగిరి, కూరగాయల వ్యాపారి