సాక్షిప్రతినిధి, నల్లగొండ: సహకార రంగంపై అవగాహన ఉన్న వారు ఎవరిని కదిలించినా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో జరిగిన కుంభకోణం దేశంలో ఏ సహకార సంస్థలోనూ జరిగి ఉండదని చెబుతున్నారు. అంతే కాదు, ఈ వ్యవహారం గురించి సీరియస్‌గా తీసుకుంటే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎక్కడ డీసీసీబీ గుర్తింపును రద్దు చేస్తుందోనని ఆందోళన కూడా చెందుతున్నారు. దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై డీసీసీబీ వర్గాలు అంత సీరియస్‌గా ఏమీ లేవు.
తూతూ మంత్రంగా తొలుత ప్రాథమిక విచారణ జరిపించి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. నిధుల గోల్‌మాల్ వ్యవహారం బయటపడి రెండు నెలలు కావస్తున్నా, నిందితుడిగా గుర్తించి సస్పెండ్ చేసిన ఏజీఎం రామయ్యను ఇంత వరకూ అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన దేవరకొండ సహకార బ్యాంకు కుంభకోణంలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవరకొండ బ్రాంచ్‌లో జరిగిన నిధుల గోల్‌మా ల్ వ్యవహారం మొత్తంగా జిల్లా సహకార రంగానికే మాయని మచ్చలా తయారైంది. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు అధికారులు నూటికి నూరు శాతం సహకారం అందించడం వల్లే నిధులు ఇబ్బడిముబ్బడిగా దేవరకొండ శాఖకు బదిలీ అయ్యాయని చెబుతున్నారు. సహకార బ్యాంకుల ద్వారా నాన్ కమాండ్ ఏరియాలో ఎకరాకు రూ 20వేలు, గరిష్టంగా రూ 80వేలకు మించకుండా క్రాప్ లోన్స్‌కు పరిమితి ఉంది.
అదే కమాండ్ ఏరియాలో గరిష్టంగా రూ లక్ష దాకా రుణం ఇవ్వొచ్చు. అదీ కచ్చితంగా ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మాత్రమే. కానీ, ఎవరికి బడితే వారికి ఇష్టం ఉన్న రీతిలో రుణాలు ఇచ్చారు. ఇదంతా స్వాహా చేయడం కోసమేనని ఇపుడు బయట పడుతోంది. పీఏపల్లి, తిమ్మాపురం, దేవరకొండ, చిత్రియాల్ సంఘాలకు సంబంధించి 2009-2013 సెప్టెంబరు దాకా ఏకంగా రూ 27కోట్లు అలాట్ అయినట్లు గుర్తించారు. అధికారులు చేసిన ప్రాథమిక విచారణ తర్వాత కేవలం 2012-13 సంవత్సరానికి 3.50కోట్ల రూపాయలు లెక్క తేలింది. గడచిన నాలుగేళ్లుగా దేవరకొండ బ్రాంచ్‌లో అక్ర మాలు యథేచ్ఛగా జరుగుతున్నా ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడలేదు.
దొంగలకు.. దొంగలు
Published Tue, Dec 3 2013 4:08 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement