బ్యాంకింగ్‌లో అవకతవకలు నిజమే!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్న అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టికి వచ్చింది. గత ఏడాది బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూఢిల్లీ అశోక్ విహార్ బ్రాంచ్‌లో చేటుచేసుకున్న రూ.6,100 కోట్ల దిగుమతుల చెల్లింపుల కుంభకోణం నేపథ్యంలో ఆర్‌బీఐ జరిపిన పరిశీలనలో తాజా అంశాలు వెలుగుచూశాయి. అనుమానాస్పద లావాదేవీల రిపోర్టుల (ఎస్‌టీఆర్) ఫైలింగ్‌లు సమర్పించకపోవడం, సమర్పించినా తీవ్ర ఆలస్యం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) మార్గదర్శకాలు పాటించకుండానే అకౌంట్ల ప్రారంభం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి.
బీఓబీ ఉదంతం తరువాత అన్ని వాణిజ్య బ్యాంకుల చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆర్‌బీఐ ఒక లేఖ రాసింది. ప్రస్తుత విధానాలపై సమీక్ష జరపాలన్నది ఈ లేఖ సారాంశం. ఎటువంటి అవకతవకలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్‌బీఐ ఈ లేఖలో బ్యాంకింగ్‌కు సూచించింది. పీటీఐ ఫైల్ చేసిన ఒక ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా అందిన ఆర్‌బీఐ లేఖ ప్రతి ద్వారా ఈ అంశాలు తెలిశాయి. వివిధ బ్యాంకులనుంచి అంతర్గత ఆడిట్ నివేదికలను తెప్పించుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ తెలిపింది.